– దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు
– విమానాశ్రయాల్లో ప్రయాణికుల పడిగాపులు
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు సోమవారం కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, శ్రీనగర్ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు పడుతున్నారు. సోమవారం ఉదయం దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో మొత్తం 134 విమానాలు రద్దయ్యాయి. అందులో 75 డిపార్చర్స్ కాగా, 59 అరైవల్స్ ఉన్నాయి. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 127 (65 అరైవల్స్, 62 డిపార్చర్స్), హైదరాబాద్‌లో 77 (38 అరైవల్స్, 39 డిపార్చర్స్), చెన్నైలో 71, అహ్మదాబాద్‌లో 20, వైజాగ్‌లో ఏడు, ముంబై, కోల్‌కతా, శ్రీనగర్‌లోనూ పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. మొత్తంగా సోమవారం ఉదయం 9:30 గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 360 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ఆదివారం ఏకంగా 650 విమానాలు రద్దు చేయగా, మొత్తం 2,300 విమానాలకు 1,650 నడిపినట్టు ఆ ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 10వ తేదీ నాటికి రాకపోకలను స్థిరీకరిస్తామని పేర్కొంది. విమానాల రాకపోకలను సాధారణ స్థితికి తేవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. మరోవైపు రోజూ వందలాది విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. వేలాది మంది ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాయడం కన్పించింది. తమ విమానాలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. తాము వివరాలు అడిగినా ఇండిగో సిబ్బంది పూర్తి సమాచారం అందజేయడం లేదని, వారి స్పందన చూసి విసిగివేసారిపోయామని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కారణంగా ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు. వరుసగా ఏడో రోజూ విమానాల రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్‌కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు విశాఖపట్నం నుంచి 7 విమానాలను ఇండిగో రద్దు చేసింది. వీటిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీకి వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి రాకపోకలు సాగించే 18 విమానాలు రద్దయ్యాయి. కాగా, ప్రయాణికులకు దిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీ జారీచేసింది. సోమవారం కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. అయితే దిల్లీ విమానాశ్రయంలో ఇప్పటివరకు మొత్తం 134 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇందులో రావాల్సినవి 59 ఉండగా, వెళ్లాల్సినవి 75 ఉన్నాయి.





