డిటిఎఫ్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచనున్నారని వివిధ పత్రికల్లో, టీవీ న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వొస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు విషయమై ప్రభుత్వానికి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం డీటీఎఫ్ (DTF) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ఉపాధ్యాయ,విద్యాపరమైన అంశాలపై నివేదికను ప్రవేశ పెట్టారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం ద్వారానే అనేక మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా వేలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు దెబ్బతిన్నాయనీ అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి అసంబద్ధంగా,అశాస్త్రీయంగా ఉన్న ఉత్తర్వులను విరమించుకోవాలని, పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలు మంజూరు చేయాలని, పిఆర్సి అమలుకు చర్యలు చేపట్టాలని,పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, ఉద్యోగ పెన్షనర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని,2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని,ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ కోరింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి రాజిరెడ్డి,పి. శాంతన్, టి. శ్రీశైలం, చాప బాబు దొర, కార్యదర్శులు ఎం. సామ్యూల్, జి. రామస్వామి, ఎ. శ్రీనివాస్ రెడ్డి, బి. శ్యామ్ అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్, పూర్వ రాష్ట్రఅధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.రఘుశంకర్ రెడ్డి,ఎం. ఎన్ .కిష్టప్ప, కే నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





