అమృతకాలంలో అయోధ్యరాముడే జాతిపిత!

“భారతీయ స్వాతంత్ర్య, జాతీయ ఉద్యమాలకు కొత్తకాలపరిధులను ఆయన నిర్వచించారు. మోదీ ఆ మాటను స్పష్టం చేయకముందు, నిజమైన స్వాతంత్ర్యం 2014లో మాత్రమే వచ్చిందని ముఖస్తుతి సాధకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. హంతకుడు గాడ్సే ఆరాధనలకు, అనుకూల వాదనలకు మౌనాంగీకారం, నెహ్రూ మీద నిలకడగా లేపుతూ వస్తున్న వ్యతిరేక దుమారం, అహింసను ప్రతిపాదించిన అవైదిక బుద్ధుడే భారత పరాధీనతకు కారణమన్న చాపకింద నీరు ప్రచారం- వీటన్నిటినీ కొనసాగిస్తున్నా- చరిత్ర నుంచి గాంధీని పూర్తిగా తొలగించే సాహసానికి మాత్రం ఇంతకాలం ఒడికట్టలేకపోయారు. ఇప్పుడది మొదలయింది…”

k srinivas sannivesam article

పిస్తోలు గుండు తగిలి నేలకూలుతున్నప్పుడు, గాంధీగారు ‘ హేరామ్‌’ అన్నారట. ఆయనకు రాముడంటే చాలా భక్తి. ఈశ్వర అల్లా తేరే నామ్‌- అంటూ అందరికీ సద్బుద్ధి ఇవ్వమని భజనల్లో రాముడిని అభ్యర్థిస్తాడు. మంచి వైష్ణవుడు,  రామనామాన్ని జపించే వైష్ణవుడు,  ఇతరుల బాధను తనదిగా భావించి సహాయం చేస్తాడని చెప్పే పాటను గాంధీజీ చాలా ఇష్టపడేవారు. భారతీయ జనగాథల్లో జీవించే అనేక రాముళ్లలో, గాంధీ రాముడు ప్రత్యేకం.  జాతీయోద్యమ ఆశయాలకు, ఆధునిక భారతానికి అవసరమైన రాముడిని గాంధీ తీర్చిదిద్దుకున్నారు. సందేహం లేదు, గాంధీ ఆధ్యాత్మికత రాజకీయమైనది.

పేరులోనే రాముడున్న నాథూరామ్‌ కూడా రామభక్తుడే అయి ఉంటాడు. అతని లాగా ఆలోచిస్తూ, గాంధీని ద్వేషించినవాళ్లు, ఆ హత్య ఒక కర్తవ్యమని భావించినవాళ్లుఅనేకులు ఉండి ఉంటారు. ఉన్నారు. వాళ్లు బాగా బలపడి, అధికారపీఠాల మీద స్థిరపడిన తరువాత గాంధీ అవశేషాల మీద కూడా అసహనం పెంచుకుని ఉంటారు. పెంచుకున్నారు. ప్రాణత్యాగం చేసిన గాంధీని, ఆయన అధికారంలో కూర్చొబెట్టిన శిష్యులను జాతీయచిహ్నాలుగా తొలగించి, కొత్త ప్రతీకలను ప్రతిష్ఠించాలని అనుకున్నారు. సాంస్కృతిక, మత జాతీయవాదానికి అవసరమైన చిహ్నంగా భావించి, ఒక పరాక్రమ  రాముడిని నిర్మించుకున్నారు. అతని జన్మభూమిని ఆవిష్కరించుకున్నారు. ఈ రాముడు గాంధీ గారి రాముడు కాదు, గాంధీ స్థానంలోకి వచ్చి చేరుతున్న రాముడు. అయోధ్యరాముడు.

నరేంద్రమోదీ మాటలే అందుకు ఆధారం. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సాగిన భారత జాతీయోద్యమాన్ని దాదాపుగా విస్మరిస్తూ, వెయ్యేళ్ల పరపాలనకు, ఐదువందలేళ్ల అవమానభారానికి అయోధ్య తెరదించిందని, ఇదే కొత్త విముక్తి అని ఆయన ఆలయ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. భారతీయ స్వాతంత్ర్య, జాతీయ ఉద్యమాలకు కొత్తకాలపరిధులను ఆయన నిర్వచించారు. మోదీ ఆ మాటను స్పష్టం చేయకముందు, నిజమైన స్వాతంత్ర్యం 2014లో మాత్రమే వచ్చిందని ముఖస్తుతి సాధకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. హంతకుడు గాడ్సే ఆరాధనలకు, అనుకూల వాదనలకు మౌనాంగీకారం,  నెహ్రూ మీద నిలకడగా లేపుతూ వస్తున్న వ్యతిరేక దుమారం, అహింసను ప్రతిపాదించిన అవైదిక బుద్ధుడే భారత పరాధీనతకు కారణమన్న చాపకింద నీరు ప్రచారం- వీటన్నిటినీ కొనసాగిస్తున్నా- చరిత్ర నుంచి గాంధీని పూర్తిగా  తొలగించే సాహసానికి మాత్రం ఇంతకాలం ఒడికట్టలేకపోయారు. ఇప్పుడది మొదలయింది.

“ఏది ఏమైనా, రామభక్తుడినైన తనకు, ఒకానొక రాముడు ప్రత్యర్థిగా నిలబడతాడని మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ ఎప్పుడూ అనుకుని ఉండరు. నా పేరు పక్కకు తోసి, తన పేరు పెట్టుకోవలసిన స్థితి ఎందుకు కలిగిందా ఆ రాముడికి అని ఎంత బాధపడేవారో!..”

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మగాంధీ పేరును తొలగించి, జీరామ్‌జీని జోడించడం యథాలాపంగానో, రహదారుల పేర్లు మార్చినట్టుగానో జరిగింది కాదు. గాంధీజీ పేరిట ఉన్న ఒక దేశవ్యాప్త పాపులర్‌ పథకానికి కొత్త పేరు పెట్టడం వెనుక, భారత జాతీయోద్యమానికి చెందిన ఒక శిఖరాయమాన విగ్రహాన్ని కూడా కూల్చివేసే తెగింపు ఉన్నది. పొడవైన పేరు నుంచి కూర్చిన పొడి అక్షరాలే అయినప్పటికీ, కొత్తపేరులోని రామ్‌జీ యాదృచ్ఛికంగా వెలిసినది కాదు. గాంధీ ఒక తరహా  జాతీయవాదానికి ప్రతినిధి. ఈ రాముడు నూతన జాతీయవాదానికి సారథి. 1947 లో విజయాన్ని అందుకున్న జాతీయోద్యమానికి గాంధీజీ నాయకులు అయితే, 2022 నుంచి2047 దాకా నడుస్తున్న వికసిత భారత ప్రస్థానానికి రాముడే నాయకుడు. రాముడి పాదుకల పేరిట రాజ్యం చేసే అభినవ భరతులే సూత్రధారులు.

విశేష ఆమోదనీయత కలిగిన నైతిక మూర్తి తమ చరిత్రలో, వర్తమానంలో ఎవరూ లేనందున, తీవ్ర భావనలు దట్టించిన ఒక దైవమూర్తిని స్ఫూర్తిగా తీసుకోవలసిన అగత్యం వికసిత భారతవాదులకు కలిగిందని అనుకోవచ్చునా? లేక, నలభై ఏళ్ల నుంచి తాము ఇటుక ఇటుకగా నిర్మిస్తూ వస్తున్న ఒక మహాభావోద్వేగానికి మించి మరేదీ తమ రాజకీయార్థిక లక్ష్యాలకు చోదకశక్తి కాలేదన్న నిర్ధారన కలిగిందా?

ఏది ఏమైనా, రామభక్తుడినైన తనకు, ఒకానొక రాముడు ప్రత్యర్థిగా నిలబడతాడని మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ ఎప్పుడూ అనుకుని ఉండరు. నా పేరు పక్కకు తోసి, తన పేరు పెట్టుకోవలసిన స్థితి ఎందుకు కలిగిందా ఆ రాముడికి అని ఎంత బాధపడేవారో!

పేరులో లేకపోతే ఏమైంది, పథకంలో నెరవేరుతున్నవి గాంధీగారి ఆశయాలే కదా, అంటున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.2005లో మొదలయిన పథకానికి 2009లో కదా, గాంధీ పేరు పెట్టారు, మధ్యలో వచ్చింది మధ్యలో పోతే తప్పేమిటి? అని, ఉపాధి రోజులను నూరు నుంచి నూటపాతిక రోజులు పెంచుతున్నాము కదా, కష్టమేమిటి? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.

“ఇప్పుడు గాంధీగారి పేరుతో ఉన్న పథకం స్థానంలో కొత్త పేరును అమలుచేయడానికి, ఉనికిలో ఉన్న స్టేషనరీలో, బోర్డులలో, ప్రచారసామగ్రిలో మార్పులు చేయాలి. అందుకు కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందట. అంటే, ఈ ఉపాధిహామీ పథకం ఎంతటి విస్తృతమైనదో, భారీదో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రచారం, ప్రభావం ఉన్న పథకాన్ని తమ చిహ్నాలతో ఊరేగించాలని ఎవరికి మాత్రం ఉండదు? జాతి పిత, జాతీయోద్యమనాయకుడు అని అనుకుంటున్న గాంధీ ఇప్పుటి పాలకులకు కాకుండా పోయారే అన్న ఆశ్చర్యపోవడం తప్ప ఏమి చేయగలం?..”

గాంధీపేరుతో సహా మొత్తంగా పేరు మార్పు, చేయడం వెనుక, సైద్ధాంతిక, వ్యూహాత్మక లక్ష్యాలు తెలుస్తూనే ఉన్నాయి. అంతమాత్రమే చేసి ఊరుకోలేదు ప్రభుత్వం! గ్రామీణ ఉపాధిపథకం సారాంశాన్నికూడా మార్చివేస్తోంది! గ్రామీణ మనుగడలు, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల జీవనాధారాలు, తీవ్ర సంక్షోభంలో పడడం మొదలయినప్పుడే అంటే, 1980ల మొదటిలోనే మహారాష్ట్రలో గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథకాన్నిప్రయోగాత్మకంగా అమలుచేశారు. మధ్యలో అనేక ఇతర పథకాలు, పనికి ఆహారం వంటివి, గ్రామాలలో పరిస్థితులు చేయిజారకుండా ఉండడానికి ప్రవేశపెట్టారు. గ్రామాల నుంచి పట్టణాలకు విపరీతమైన వలసలను నివారించడానికి, కనాకష్టంగా అయినా పల్లెకుటుంబాలు బతికి బట్టకట్టడానికి ఉద్దేశించిన ఇటువంటి పథకాల వెనుక, తాత్కాలిక ఉపశమనదృష్టి, సంక్షేమ దృష్టి తప్ప మరేవీ లేదు. ఇవేమీ విప్లవాత్మకాలు కావు, కానీ, ప్రాణాధార ఔషధాల వంటివి.

2005లో యుపిఎ ప్రభుత్వం ఎన్ఆర్ఇజిఎ (నరేగా) చట్టం, ఏడాదికి కనీసం వంద పనిరోజులను హక్కుగా గ్యారంటీ చేసింది. దరఖాస్తు పెట్టుకున్న పదిహేను రోజులలోగా ఆ హక్కును అమలుచేయవలసి ఉంటుంది. ఒక సంక్షేమ చర్యను హక్కుగా మలచడం ఒక విశేషమైన, అపూర్వమైన చర్య. ఇప్పుడు, ఆ చట్టం స్థానంలో ఆమోదం పొందిన బిల్లు, విబి-జిరామ్‌జి బిల్లు,  ఆ హక్కు భావనను  చేర్చలేదు. పథకాన్ని కేవలం కార్యక్రమంగా మాత్రమే భావించింది. పైగా, ఉపాధిపనుల కల్పనకు అనేక నిబంధనలను విధించింది. వ్యవసాయపనులు జరిగే సమయంలో ఉపాధిహామీ పనులు కల్పించకూడదనే విధానం తీసుకుంది.

గాంధీగారికి, ఈ గ్రామీణ ఉపాధి హామీకి ఏమి సంబంధం? ఆయన మాత్రం పనిహక్కును గుర్తించారా? అన్న సందేహాలు రావచ్చును. హక్కులు కోరని పౌరబాధ్యతల గురించి అమృతకాలంలో జరిగే వికసిత ప్రయాణం వక్కాణిస్తుంది. గాంధీ కూడా నెరవేర్చే బాధ్యతల నుంచే హక్కులు లభిస్తాయని చెప్పినవారే. కానీ, రెండు వాదనలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. గాంధీది నైతికమైన, న్యాయాన్యాయవిచక్షణల దృష్టి. ఎంత కాల్పనికమైనదైనా, లేదా, ఎంత భూస్వామ్య భూయిష్ఠమైనదైనా, గ్రామం స్వయంపోషకంగా ఉండాలని గాంధీ కోరుకున్నారు. గ్రామం నుంచి బయటకు వలసలు జరగకూడదని అన్నారు. శరీరశ్రమ ప్రతిఒక్కరి కర్తవ్యం అన్నారు. పరస్పరత నుంచి గ్రామంలో ఆహారభద్రతల నుంచి అన్ని భద్రతలు సమకూరాలన్నారు. గ్రామనిర్ణయాలలో అందరి భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నారు. గ్రామాలలో గౌరవప్రదమైన మనుగడలకు గ్యారంటీ అక్కడి సమష్టి నుంచే సమకూరుతుందని  చెప్పిన గాంధీ మాటను హక్కులలోకి అనువదిస్తే, ఆ స్ఫూర్తి ఉపాధిపూచీకి దగ్గరగానే ఉంటుంది.

ఇన్నేళ్ల స్వతంత్రం తరువాత కూడా పల్లె ప్రజలను గుంతలు తవ్వే పనుల ద్వారా బతకమని చెప్పడం ఏమి అభివృద్ధి అని కేంద్ర అధికారపక్షం విమర్శిస్తూ వచ్చింది కానీ, నరేగా ను రద్దు చేయలేకపోయింది. పైగా ఇప్పుడు మరో పాతిక రోజులను పథకానికి జోడించింది కూడా. దేశాన్ని కొత్త ఎత్తుల మీదకు నడిపించే పాలనలో కూడా పల్లె జనాలకు పనులు కల్పించి అన్నం పెట్టడమేనా అన్న ప్రశ్న మాత్రం వారికి కలగడం లేదు.

ఇప్పుడు గాంధీగారి పేరుతో ఉన్న పథకం స్థానంలో కొత్త పేరును అమలుచేయడానికి, ఉనికిలో ఉన్న స్టేషనరీలో, బోర్డులలో, ప్రచారసామగ్రిలో మార్పులు చేయాలి. అందుకు కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందట. అంటే, ఈ ఉపాధిహామీ పథకం ఎంతటి విస్తృతమైనదో, భారీదో అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రచారం, ప్రభావం ఉన్న పథకాన్ని తమ చిహ్నాలతో ఊరేగించాలని ఎవరికి మాత్రం ఉండదు? జాతి పిత, జాతీయోద్యమనాయకుడు అని అనుకుంటున్న గాంధీ ఇప్పుటి పాలకులకు కాకుండా పోయారే అన్న ఆశ్చర్యపోవడం తప్ప ఏమి చేయగలం?

ఎప్పుడో త్రేతాయుగంలో, మహా మహా రావణాసురుడినే ఢీకొన్న రాముడితో, కలియుగ రాజకీయవాదులు చిత్రచిత్ర విన్యాసాలు చేయిస్తున్నారు.  బాబర్‌తో యుద్ధం చేయించారు. ఇప్పుడు గాంధీతో కుస్తీపట్టిస్తున్నారు! ఓట్ల బొమ్మని చేసి ఆడిస్తున్నారు!

హేరామ్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *