మేనిఫెస్టో అమలుకు బీజేపీ కట్టుబడి ఉండాలి

తెలంగాణలో కాల్పుల విరమణ అమలు చేయాలి
శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: ‘పాకిస్తాన్‌తో నైనా శాంతి చర్చలు జరుపుతాము కానీ ఆదివాసీలతో, వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపము’ అనే మోదీ-షా ప్రభుత్వ వైఖరిని ఖండిరచాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. తెలంగాణ లో కాల్పుల విరమణను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని కోరింది. గత నెల 29న నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన అమిత్‌ షా కిసాన్‌ సమ్మేళన్‌లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆయుధాలు చేపట్టిన వారితో చర్చలు జరపదనీ, కాబట్టి మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదనీ, 2026 మార్చి 31కల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని ప్రకటించారన్నారు. మావోయిస్టులు ఇప్పటిదాకా 40 వేల మంది ఆదివాసీలను హతమార్చారని అబద్ధపు ప్రకటన కూడా చేశారని, శాంతి చర్చలు జరపాలంటున్నారంటూ కొందరు కాంగ్రెస్‌ నేతలను నిందించారని కూడా పేర్కొంది. బిజేపి ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి ముఖ్యమంత్రి మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. అంతేకాక అక్కడ ఎన్నికలకు ముందు బిజేపి తమ మేనిఫెస్టోలోనే మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రకటించి ఉన్నది. దాన్ని కూడా ఎన్నికలలో గెలవడం కోసం తాము చేసిన ‘జుమ్లా’ అని ఇప్పుడు అమిత్‌ షా కొట్టి పారేయవచ్చు. అది ఆయనకు అలవాటేనని ఆరోపించింది. ఏదేమైనా నాటి నుండి అంతకు ముందు కూడా ఉద్యమ బలాబలాలతో నిమిత్తం లేకుండా ప్రజల ప్రయోజనం కోసం తాము ఎప్పుడూ చర్చలకు సిద్ధమే అని ప్రకటిస్తూ వస్తున్నాం. అధికార పార్టీలే అందుకు సిద్ధంగా లేవు. మరింత నిర్దిష్టంగా తెలంగాణలో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ మార్చి నెలలో చర్చల కోసం పిలుపునిచ్చిన తరువాత అందుకు స్పందనగా మార్చి 28న మేము అందుకు సిద్ధమంటూ అందుకోసం భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేసి, కొత్త క్యాంపుల నిర్మాణం ఆపి చర్చల కోసం తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని ప్రకటించాం. ఆ తరువాత తాము ఏకపక్షంగా నెలరోజుల పాటు కాల్పుల విరమణను పాటిస్తామని కూడా ప్రకటించాం. దానికి మేము నిజాయితీగా కట్టుబడి ఉన్నాం. అయినా మోదీ-షాల భద్రతా బలగాలు తమ పార్టీని, తమ జల్‌-జంగల్‌-జమీన్‌- ఇజ్జత్‌ల కోసం ఆదివాసులు కొనసాగిస్తున్న ప్రతిఘటనా ఉద్యమాలను తుదముట్టించే ఉద్దేశంతో దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయని పేర్కొంది. కాల్పుల విరమణను ప్రకటించిన తరువాత కూడా 85మందికి పైగా మా పార్టీ. పిఎల్‌ఏ కార్యకర్తలను, సైనికులను, నాయకులను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మట్టుపెట్టింది. మా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు (బసవరాజు) సహా ఎంతోమంది నాయకులను చుట్టుముట్టి చంపివేసింది. సాధారణ ఆదివాసీ గ్రామస్తులను సైతం పట్టుకొని కాల్చి చంపి మావోయిస్టులని ప్రకటించింది. ఈ మధ్యనే బడి పిల్లల హాస్టల్‌లో వంట చేసి వడ్డించే ఒక సాధారణ ఆదివాసీని కూడా హతమార్చిన ఉదంతం బయటపడిరది. మానవ తలలపై వెలలు ప్రకటించడం వల్ల కోట్లాది రూపాయల రివార్డు కోసం కూడా భద్రతా బలగాలు ఇంత విచ్చలవిడిగా హత్యాకాండకు పాల్పడుతున్నాయి. చనిపోయిన వారి శవాలను కూడా వారి కుటుంబ సభ్యులకు సరిగా అప్పగించడం లేదు. ఎన్నో అడ్డంకులను కల్పిస్తూ శవాలను భద్రపరచకుండా కుళ్లిపోయేలా చేస్తున్నారు. కనీస మానవ విలువలను కూడా పాటించడం లేదు. ఎన్నో అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను కూడా భారత ప్రభుత్వం, భద్రతా బలగాలు ఉల్లంఘిస్తున్నాయి. మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు, నాగేశ్వర రావు తదితర ఎనిమిది మంది శవాలను కూడా బంధువులకు అప్పగించలేదు. ఆఖరికి బసవరాజు కుటుంబీకులు తమ ఇంటివద్ద జరుపుకుంటున్న కర్మకాండను కూడా అడ్డుకొని ఆంక్షలు విధించారు. అయినా మేము ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆదివాసీల జాతి హననాన్ని ఆపడానికి, వారి నేలను, అడవులను రక్షించడానికి ఇప్పటికీ చర్చల ప్రతిపాదన నుండి వెనక్కు తగ్గలేదని ఆ ప్రకటన పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *