పంటలకు కనీస మద్దతు ధరల స్థిరీకరణ ముఖ్యం
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వెల్లడి
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వెల్లడి
న్యూదిల్లీ, డిసెంబర్18: వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో పంటలకు అందిస్తున్న కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పి) చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని అన్నదాతలు, పలు రైతు సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంఎస్‌పిలకు చట్టబద్ధత కోరుతూ శంభు, ఖనౌరీ సరిహద్దుల వద్ద రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సిఫారసు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, జలంధర్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చెన్నీ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లపై లోక్‌సభకు తన తొలి నివేదికను అందజేసింది. నిజానికి మద్దతు ధరలతో పాటు, వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు రావాల్సి ఉంది. రైతులకు మద్దతుతో పాటు, వ్యవసాయ ప్రోత్సాహకాలు అందాలి. అలాగే దేశంలో ఆహారధాన్యాల దిగుబడిని పెంచుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే వీటి దిగుబడులు తగ్గించుకోవడం ద్వారా దేశీయంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దేశంలో వ్యవసాయ సంస్కరణలు, రైతుల సంక్షేమం కేంద్రంగా జరుగుతున్న చర్చలో ఎంఎస్‌పీల అమలు కేంద్ర బిందువుగా ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది. ఎంఎస్‌పిలకు చట్టబద్ధత కల్పిస్తే దేశంలో రైతుల ఆత్మహత్యలను తగ్గించవచ్చని పేర్కొంది.
రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం, మార్కెట్‌లో నెలకొంటున్న అస్థిర పరిస్థితుల నుంచి వారికి రక్షణ కల్పించడం, రుణ భారాన్ని తగ్గించడం ద్వారా ఆత్మహత్యల నుండి రైతులను కాపాడవచ్చు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎంఎస్‌పిలకు చట్టబద్ధత కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. రైతుల ఇక్కట్లకు, ఆత్మహత్యలకు రుణభారమే కారణమని కమిటీ అభిప్రాయపడింది. అన్నదాతలు, వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేసేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచించింది. 2021-22, 2024-25 మధ్యకాలంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు అధిక కేటాయింపులు జరిపినప్పటికీ కేంద్ర ప్రణాళికా వ్యయంలో ఈ శాఖ వాటా 3.53 శాతం నుండి 2.54 శాతానికి తగ్గిపోయిందని కమిటీ అందజేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్పాదకతను మెరుగుపరచడానికి వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని కమిటీ కోరింది.
పిఎం -కిసాన్ పథకానికి అందిస్తున్న వార్షిక మద్దతును రూ.6,000 నుండి రూ.12,000కు పెంచాలని కూడా సిఫారసు చేసింది. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అందేలా చూడడానికి సాధ్యమైనంత త్వరగా జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, దీనివల్ల వారికి లభించాల్సిన హక్కులు దక్కుతాయని కమిటీ తెలిపింది. ఇకపోతే గ్రాణ ఉపాధి హా చట్టం వేతనాలు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా లేవని పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ తన నివేదికను పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్పించింది. ఈ పథకం కింద 2008 నుంచి చెల్లిస్తున్న వేతనాలపై ప్యానెల్ అధ్యయనం చేసింది. తక్కువ వేతనాలు, ఆలస్యంగా చెల్లింపులు చేయడం కార్మికుల్ని నిరుత్సాహపరుస్తుంది. మెరుగైన వేతనాలు ఇచ్చే ప్రాంతాలకు వలస, పనికోసం వెళ్లడానికి ప్రేరేపిస్తుందని ప్యానెల్ పేర్కొంది. ఉపాధి వేతనాల స్థిరీకరణ కోసం ఇప్పటి వరకూ బేస్ రేట్‌ను సవరించలేదని ప్యానెల్ విమర్శించింది.