మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం

– 8నుంచి మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్-2026 పోటీలు
– ఏర్పాట్లు పూర్తయ్యాయన్న మంత్రి శ్రీహరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్ 2026 పోటీలు ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు గచ్చిబౌలిలోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్‌తోపాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వె, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఆస్ట్రో టర్ఫ్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. టోర్నమెంట్‌ను లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ అన్ని సదుపాయాలను సమకూర్చింది. ఈ నేపథ్యంలో ఎల్‌బీ స్టేడియంలో గురువారం విలేకరుల సమావేశంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ హాకీలో దేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై వుమెన్ హాకీ టోర్నమెంట్-2026 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్ 2026కి ఈ పోటీలు కీలకంగామారనున్నాయన్నారు. క్రీడాకారుడైన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో గచ్చిబౌలిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్ట్రోటర్ఫ్ మైదానం, హై సెక్యూరిటీ, ఆధునిక సదుపాయాలు, క్రీడాకారులకు అత్యుత్తమ వసతి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఏర్పాట్లలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే హాకీ, హాకీ ఇండియా  ప్రతినిధులతో సమన్వయం కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమగ్ర సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పారు. అంతర్జాతీయ ప్రతినిధులు, క్రీడాకారుల కోసం నగరంలోని వారసత్వ ప్రదేశాల పర్యటనలు, వినోద కార్యక్రమాల రూపకల్పన కూడా చేపట్టాలని భావిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇటీవల రెండో విడత చీఫ్ మినిస్టర్ కప్-2025 గ్రామస్థాయి నుండి ఐదు అంచెల్లో దిగ్విజయంగా నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలతో క్రీడా శాఖ ముందుకు వెళుతుందని మంత్రి శ్రీహరి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ కె.శివసేనా రెడ్డి, సాట్ జి ఎండీ  సోని బాల మాయాదేవి, ఇతర క్రీడాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *