ప్రపంచస్థాయి కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్‌

– హైదరాబాదులో వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటు
– తెలంగాణ టెక్నాలజీ, ఆవిష్కరణలకు గుర్తింపు
– ఫ్యూచర్‌ సిటీలో సంస్థ సొంత సెంటర్‌ను నిర్మించాలి
– ‘వాన్‌ గార్డ్‌’సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు

హైదరాబాదు, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభం అంటే రాష్ట్రంలో టెక్నాలజీ, ఆవిష్కరణలకు ఒక గుర్తింపుగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నాలెడ్జ్‌ సెంటర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ ప్రపంచస్థాయి కంపెనీలకు హైదరాబాద్‌ ఒక కేంద్రంగా మారిందన్నారు. హైదరాబాదులో వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున వాన్‌ గార్డ్‌ నాయకత్వానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ కంపెనీ చరిత్రలో ముఖ్యమైన మైలురాయికి మీకు అభినందనలు తెలియజేస్తున్నానని సిబ్బందినుద్దేశించి డిప్యూటీ సీఎం అన్నారు. వాన్‌ గార్డ్‌ హైదరాబాదులో గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ను స్థాపించాలనే నిర్ణయం తీసుకోవడం రాష్ట్రంలో టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతున్న భాగ్యనగరం ప్రతిష్టకు గొప్ప గుర్తింపు అని అభివర్ణించారు. దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ విద్యాసంస్థలు ఉన్న నగరంగా, ప్రతి సంవత్సరం వేలాదిమంది వృత్తి నిపుణులను హైదరాబాద్‌ అందిస్తుంది అని తెలిపారు. అత్యున్నత ప్రతిభా వనం, స్టార్టప్‌ సంస్కృతి, పరిశ్రమ, అకాడమిల సమన్వయం, ఇవన్నీ వాన్‌ గార్డ్‌ వంటి సంస్థలు అభివృద్ధి చెందడానికి హైదరాబాద్‌ను సరైన ప్రదేశంగా మార్చుతున్నాయన్నారు. ప్రపంచస్థాయి సంస్థలకు తెలంగాణలో వ్యాపారం చేసే వేదిక మాత్రమే కాక అభివృద్ధిలో భాగస్వామిని కూడా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తన సహచరుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, ఇండస్ట్రీస్‌, కామర్స్‌, లెజిస్లేటివ్‌ వ్యవహారాల శాఖల మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబును కూడా ప్రస్తావించదలిచానన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం టెక్నాలజీ, పరిశ్రమ రంగాల్లో విశేష పురోగతి సాధిస్తోందని తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మా విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్‌ హబ్‌లతో మరింత సహకార అవకాశాలను వాన్‌ గార్డ్‌ పరిశీలించాలని ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాదులో భవిష్యత్తు సిటీగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఒక స్థలాన్ని తీసుకొని వాన్‌ గార్డ్‌ సొంత సెంటర్‌ నిర్మించే అంశంపై లోతుగా ఆలోచన చేయాలని నిర్వాహకులను కోరారు. ఫ్యూచర్‌ సిటీలో వాన్‌ గార్డ్‌ సొంత కేంద్ర నిర్మాణానికి సంబంధిత మంత్రులు చొరవ చూపాలని తాను కోరుతున్నానన్నారు.

లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు : మంత్రి శ్రీధర్‌బాబు

వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ప్రారంభించి కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌లో స్కిల్లింగ్‌, రీ స్కిల్లింగ్‌, అప్‌ స్కిల్లింగ్‌లో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. హైదరాబాద్‌ ప్రస్తుతం విశ్వసనీయత, సమగ్రత, ఇన్నోవేషన్‌ కు చిరునామాగా మారిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్‌ తమ గ్లోబల్‌ వ్యాల్యూ సెంటర్‌(జీవీసీ)ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఈ నగర సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ప్రపంచ ఆర్థిక, సాంకేతిక పటంలో తెలంగాణ బ్రాండ్‌ మరింత విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. ప్రస్తుతం వరల్డ్‌ టాప్‌-7 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇవి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నాయని వివరించారు. ఈ కొత్త జీవీసీ ఇంజనీరింగ్‌ ఎక్స్‌లెన్స్‌, క్లౌడ్‌ మోడర్నైజేషన్‌, డేటా అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీకి ఒక హబ్‌గా సేవలందిస్తుందన్నారు. ఇది వాన్‌గార్డ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌లో నూతన ఆవిష్కరణలకు మార్గ నిర్దేశం చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌, కంపెనీ ప్రతినిధులు నితిన్‌ థండన్‌, వెంకటేష్‌, జాన్‌, కిమ్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *