– ఈ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పడం సంతృప్తినిచ్చింది
– నా విజ్ఞప్తిని మన్నించిన సంస్థ
– నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిటల్
– మాజీ మంత్రి హరీష్‌రావు
సత్యసాయి ట్రస్ట్ వాళ్లు చేసే గొప్ప కార్యక్రమంలో ఉడుతా భక్తిగా నేనేదో ప్రయత్నం చేసి ఉండొచ్చు. లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఈ హాస్పిటల్ ఇస్ ఫరెవర్. ఈ హాస్పిటల్ కి వచ్చి పిల్లలతో, తల్లిదండ్రులతో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కొండపాకలో సత్య సాయి సంజీవిని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ లో 196 మంది పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ చేసిన సందర్భంగా గిఫ్ట్ ఏ లైఫ్ ప్రోగ్రాంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆ మెరుపులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఈ హాస్పిటల్లో కేవలం మందులే కాదు దేవుని ఆశీర్వాదం, ప్రేమ దొరుకుతుంది. ఇక్కడికొచ్చే పేషెంట్లను వారు తమ పిల్లలుగా భావించి సేవలు చేస్తున్నారు. అదే సగం రోగాన్ని తగ్గిస్తుంది. సిర్ఫ్ దిల్ బినా బిల్, ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి, కడుపునిండా అన్నం పెట్టి, బస్సు కిరాయిలు పెట్టి పంపించారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల ప్రజా జీవితంలో కొన్ని పనులు అత్యంత సంతృప్తిని, ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో ఒకటి ఈ సత్యసాయి హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పడం. కాళేశ్వరం ద్వారా నీళ్లను పంట పొలాలకు పారించి రైతుల కళ్ళల్లో ఆనందం చూశాను. ఈరోజు గుండె ఆపరేషన్ జరిగిన పిల్లలు, వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. సత్యసాయి ట్రస్ట్ వారు ఈ ప్రాంతంలో గర్భిణుల బాగోగులు చూసేందుకు ఒక హాస్పిటల్ పెట్టాలని అడిగారు. పిల్లలకు గుండె ఆపరేషన్ చేసే హాస్పిటల్స్ ను వివిధ రాష్ట్రాల్లో సత్యసాయి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. అలాంటి హాస్పిటల్ ఒకటి ఇక్కడ పెట్టండి అని నేను వారికి విజ్ఞప్తి చేశాను. మాటల్లో నేను వీరికి కృతజ్ఞత చెప్పలేను. ఏదైనా మాట్లాడ్డం చాలా సులువైన విషయం. కానీ ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించి వందల మంది పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేసే ఇంత గొప్ప కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. వారికి ఇక్కడ భాష తెలియదు ఏమి తెలియదు. అయినప్పటికీ వారిని గుండెలకు హత్తుకొని నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రాంత నాయకునిగా ఈ ప్రాంత ప్రజలుగా మనం ఎప్పటికీ సత్యసాయి ట్రస్టుకు, శ్రీనివాస్ గారికి రుణపడి ఉండాలన్నారు. ఈ సేవ నుండి మనం కూడా కొంత ప్రేరణ పొందాలి. ఇక్కడ ఆపరేషన్ చేసుకున్న వారందరూ పేదవారే. మీరు వీరికి అందించిన వైద్యం చాలా గొప్పది. ఒక జీవితాన్ని ఇచ్చింది. పుట్టపర్తి ఆశ్రమంలో ప్రపంచ దేశాల నుండి ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా వచ్చి పని చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అన్నీ మర్చిపోయి నా ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఆనందంగా, సంతోషంగా గడిపానన్నారు. ఆ పిల్లల ముఖంలో ఆనందాన్ని చూస్తే నాకు కొత్త ఉత్సాహం కలిగింది. ఈ కార్యక్రమం గురించి ఎక్కువమందికి తెలపాలి. ఇంకెక్కువమంది దీని ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. 2,60,000 మంది పిల్లలు దేశంలో గుండె సమస్యతో బాధపడుతుంటే కేవలం 10 శాతం మందికి మాత్రమే వైద్యం అందుతున్నది. ఆ పిల్లలు, తల్లిదండ్రులు పడే బాధ, క్షోభ అనుభవించే వారికే తెలుస్తుంది. ముందు పిల్లలు బరువు పెరగకుండా, శ్వాస తీర్చుకోవడం కష్టమై ఎంతో ఇబ్బంది పడుతుంటే తల్లితండ్రులు ఎంత క్షోభ అనుభవించి ఉంటారు. ఇంకా ఈ దేశంలో దాదాపు 60, 70 వేల మందికి ప్రతి సంవత్సరం వైద్యం అందడం లేదు. అది ఎంత తొందరగా గుర్తించి వైద్యం అందుతే అంత తొందరగా పిల్లలు కోలుకుంటారు. ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది. ఆపరేషన్లు పెరిగిన కొద్దీ ఇంకో ఆపరేషన్ థియేటర్ ఓపెన్ చేసి ఎంతమందికైనా వైద్యం అందిస్తామని వారు అంటున్నారు. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేపడతామన్నారు అందుకు ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు, ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నానన్నారు.





