– సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టీకరణ
న్యూదిల్లీ,అక్టోబర్ 15:మరణశిక్షఅమలు విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే కేంద్రం ఇచ్చిన సమాధానంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలానుగుణంగా మార్పులను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడమే ఇక్కడ సమస్య అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేశారు. కనీసం మరణశిక్ష పడిన ఖైదీకి.. ఉరితీతా? లేదా ప్రాణాంతక ఇంజెక్షనా? అని ఎంచుకునే అవకాశమైనా ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అమెరికాలోని 49 రాష్ట్రాలు మరణశిక్ష అమలులో ప్రాణాంతక ఇంజెక్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల మరణ సమయంలో శిక్షపడ్డ నేరస్థుడికి తక్కువ వేదన ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిందని పిటిషనర్ అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి దాన్ని పరిగణించేలా చూడాలని ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి సూచించారు. అయితే, పిటిషనర్ సూచన సాధ్యమయ్యేది కాదని.. దాన్ని ఇప్పటికే తమ కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు కేంద్రం తరఫు కౌన్సిల్ కోర్టుకు వివరించింది. ఇది విధానపరమైన నిర్ణయమని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని గతంలో పరిశీలించినట్లు కోర్టుకు తెలిపారు. కేంద్రం సమాధానంపై ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. కాలానుగుణంగా ఎన్నో అంశాల్లో మార్పులు వచ్చాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆ మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా లేదు. అదే ఇక్కడ సమస్యగా మారిందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రస్తుతానికి దీనిపై తాము ఎలాంటి విధానపరమైన ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబరు 11వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





