పాలనా వైఫల్యంతో గురుకులాలు నిర్వీర్యం

ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ రావు ధ్వజం
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రశ్నార్థకమవుతున్నదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమన్నారు.
జనవరి నుండి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని, బకాయిలు చెల్లించకుంటే జులై 1 నుండి అన్ని రకాల ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మరోవైపు 13 నెలలుగా రూ.450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా యూనిఫాం, టై, బెల్ట్‌, బూట్లు, స్కూల్‌ బ్యాగులు ఇంతవరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థ రేవంత్‌ పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమన్నారు. దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *