అత్యుత్తమ సేవలందించిన సిబ్బందికి అవార్డులు
పోషకాహార తెలంగాణే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలి
సిబ్బంది తప్పిదాలతో మాపై విమర్శలు
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్ధాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని, 313 సెంటర్లు ఇంకా తెరుచుకోలేదని, చిన్నారులు లేరనే సాకు చెప్పడం సరికాదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వొచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కళకళలాడాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలకు గ్రేడింగ్ లు ఇస్తామని, మంచి గ్రేడింగ్ లు వొచ్చే కేంద్రాల సిబ్బందికి, జిల్లా అధికారులకు అవార్డ్స్ ఇస్తామని తెలిపారు. అంగన్వాడీకి అందే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సెంటర్ లో కనీసం 20 మంది చిన్నారులు ఉండేలా చర్యలు చేపట్టాలి. బడి బాట తరహాలోనే మీరు గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించండి. 30 అంగన్వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరు.
198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5 లోపే ఉంది. 586 కేంద్రాల్లో పదిలోపే ఉన్నారు. ప్రభుత్వం చిన్నారుల సంక్షేమం పై వందల కోట్లు ఖర్చు చేస్తుంది. మీరు సీరియస్ గా ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయి. అంగన్వాడి సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత మీదేనని చెప్పారు. కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఈ-టెండర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదు? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. సిబ్బంది తప్పిదాల వల్ల తాము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరా ను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది..సంజాయిషీ ఇవ్వాల్సిందే పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిని నిలిపి వేసి ఈ- టెండర్ విధానాన్నీ అవలంబించండి. కలెక్టర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్ మెంట్ కమిటీ ద్వారా టెండర్లు పిలవండి. సామ్, మామ్ చిన్నారులను గుర్తించి రిపోర్ట్ చేయండి.
మీకు చెడ్డ పేరు వస్తుందని పిల్లల పోషకాహర లోపాన్ని దాచి పెడితే సమాజానికి నష్టం. 50 శాతం మంది అసలు రిపోర్ట్ చేయడం లేదు. అందుకే చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా..బలహీనమైన పిల్లలను గుర్తించి మాకు నివేదించండి. ఏం చేయాలో మేము చెబుతాం. పిల్లల అమ్మకాలు, బాల్య వివాహాలు, నిభందనలకు విరుద్దంగా దత్తత లపై దృష్టి పెట్టాలని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వారిలో చైతన్యం తెచ్చే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పరిశుభ్రత, పౌష్టికాహారంలో అంగన్వాడి కేంద్రాలు నెంబర్ వన్ గా నిలవాలని, డిడబ్ల్యుఓలతో మే మొదటి వారంలో చింతన్ శివిర్ నిర్వహిస్తామన్నారు. అంగన్వాడి లో అందుతున్న సేవల మెరుగుదల కోసం మేధో మథనం నిర్వహిస్తాం అన్ని విభాగాల్లో తెలంగాణ అంగన్వాడి కేంద్రాలు నెంబర్ వన్ గా నిలవాలి.
కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇచ్చిన విధంగానే.. మేము జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తాం ఎక్కువ గ్రేడింగ్ ఉన్న జిల్లాల్లో అనుసరిస్తున్న విధానాలను ఇతర జిల్లాల్లో అమలు చేస్తాం. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పాత్ర చాలా గొప్పది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టులను బ్లాక్ లిస్టులో పెడతాం. హైదరాబాద్ జిల్లాలో కోడిగుడ్ల సరఫరా సరిగా చేయని ఓ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ చేశాం. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. సామాజిక దురాచారాలను రుగ్మతలను పారదోలే విధంగా అంగన్వాడి కేంద్రాలు పని చేయాలి. బాల్య వివాహాలు ఒకటి కూడా లేకుండా చూడాలి. మహిళలపై దాడులు వెలుగు చూసిన వెంటనే జిల్లా సంక్షేమ అధికారులు కేసులు బుక్ చేయించాలి, బాధితులకు భరోసా కల్పించే విధంగా అధికారులు వ్యవహరించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఆమె హెచ్చరించారు.