పుష్కరాల ఏర్పాట్లు అభినందనీయం : గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

సరస్వతీ పుష్కర స్నానమాచరించిన గవర్నర్ దంపతులు
ఘ‌న‌ స్వాగతం పలికిన మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 25 : సరస్వతి పుష్కరాలకు సంబంధించిన‌ ఏర్పాట్లు బాగున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ (Governor Jishnu Dev varma) అన్నారు. ఆదివారం సరస్వతి ఘాట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర స్నానమాచరించారు. అనంత‌రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమంలో ఆదివారం పుష్కర స్నానాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు సరస్వతి ఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సరస్వతి ఏక శిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11.02 గంటలకు హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. పుష్కర స్నానానంతరం గవర్నర్ దంపతులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పరివట్టం, పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం తెలిపారు.గవర్నర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఆశీర్వచనం అందించి, లడ్డూ ప్రసాదం, చక్కెర పొంగలి, అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి గురించి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుష్కర ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించి అధికారులను అభినందించారు. గవర్నర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్ వర్మమాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు పుష్కర స్నానాలు ఆచరించాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *