పిల్లలకు భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలు నేర్పించాలి
ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలి
విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందాలని, ఇందుకవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 20మంది కన్నా ఎక్కువమంది పిల్లలు ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని వెల్లడిరచారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ఠ్రంలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్‌ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్ధీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్‌కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించడంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. పిల్లలకు కుటుంబం, సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతోపాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని సీఎం అన్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.




