తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం పదిన్నరకు వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణపై కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు రేపటి వరకూ సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోరడంతో విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం శుక్రవారం ఉదయం పదిన్నరకు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ విూట్ పెట్టి లడ్డూ కల్తీ అంశం గురించి ప్రకటించి నందున సిట్ విచారణపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది.
అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించే అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అయితే కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా వాయిదా కోరారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే విచారణలో కేంద్రం చెప్పే అభిప్రాయాన్ని బట్టి సుప్రీంకోర్టు లడ్డూ కల్తీ అంశాన్ని ఏ దర్యాప్తు సంస్థ విచారణ చేయాలన్నది ఖరారు చేస్తారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు. ఒక వేళ సిట్ కు అనుమతి ఇస్తే.. విచారణ కొనసాగించే అవకాశం ఉంది. సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుమతి ఇస్తే.. ఆయా సంస్థలు కేసును టేకప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే పిటిషనర్లు మాత్రం.. ఎవరు దర్యాప్తు చేసినా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్తలపై నమ్మకం లేదంటున్నారు.





