ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 5

(గత సంచిక తరువాయి)
మెహర్లు, మాంగ్ లుఊరి బయట ఉంటూ, ఊరిని కాపలా కాయటం, ఊరిని శుభ్రం చేయటం, చనిపోయిన జంతువుల్ని తీసివేయటం, వాటి చర్మాలతో చెప్పులు కుట్టడం, తాళ్ళు పేనడం, బుట్టలల్లడం, పొలాలకు నీరు పారించడం, ఉన్నత జాతుల దయా దాక్షిణ్యాల మీద మనుగడ సాగించడం, ఇతర కులాల వారికి ఉండే సౌకర్యాలేవీ వీరికి లేకపోవడం వంటివి గమనించవచ్చు. అంబేద్కర్ అభ్యుదయ ధోరణుల ఫలితంగా కొంత చైతన్యాన్ని సంతరించుకొని, తమ హక్కుల్ని సాధించుకొని, జన జీవన స్రవంతిలో దళితుల కుటుంబాలు కలిసిపోయాయని దేవరాజు అభిప్రాయపడ్డారు.

‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’ లో కళాకారిణుల జీవన నేపథ్యం కనిపిస్తుంది. ‘వినోదిని’, ‘హంస వాడ్కర్’ జీవితాల్లో గల విషాద దృశ్యాలను దేవరాజు తెలిపారు. నాటక రంగంలో ఓ మైలురాయిగా వెలిగిన వినోదినికి నాటక ప్రదర్శనలో కృత్రిమంగా ఏవైతే సృష్టించబడుతాయో అవే ఆమె జీవితంలో ప్రత్యక్షంగా ఎదురైయాయి. వినోదిని బెంగాల్ ప్రాంతంలో ఒక వేశ్య కుటుంబంలో పుట్టిన వనిత. స్త్రీలు ఇంటి గుమ్మం దాటి వేషాలు వేయడం అంటే సమాజం చిన్న చూపు చూసే ఆ రోజుల్లో ఒక వేశ్యా కుటుంబంలో పుట్టి, ఆ వృత్తి నుంచి బయటపడి గొప్ప కళాకారిణిగా గుర్తింపు పొందింది. ఆమె సభ్య సమాజాన్ని అడిగిన ప్రశ్నలను దేవరాజు ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ‘వేశ్యా కుటుంబంలో పుట్టడమే నా తప్పా? అయినా వంశపారంపర్యంగా మా వృత్తిని నిరసించి బయటపడి, నాటక రంగానికి అంకితమైన కళాకారిణిని నేను, నన్ను గౌరవించాల్సిన సమాజమే తిరస్కరించింది.

విచారించాల్సిన విషయం ఏమిటంటే, రంగస్థలం మీద నా అభినయాన్ని అభినందించారు. నిజ జీవితలో నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీశారు” (పు. 66) దాదాపు ఇలాంటి జీవితమే హంస వాడ్కర్ లోకనిపిస్తుంది. ఆత్మస్థైర్యం, నిగ్రహం, వివేచన లేనప్పుడు ఆర్థిక స్వాతంత్య్రం ఉండి కూడా బానిస బతుకు బతకాల్సివస్తుందని, నైతికంగా దిగజారిన తర్వాత ఏ సిద్ధాంతం వారిని ఆదుకోలేదని అంటారు దేవరాజు. సినిమా కళాకారిణిగా గుర్తింపు పొంది కూడా ఒక మహిళగా ఆమె పడిన క్షోభ, అందులో ఆమె అంతర్మధనం అనంతమైంది. ఆమె తన తల్లిపై కోపాన్ని, భర్తపై కోపాన్ని, సమాజంపై కోపాన్ని, చివరకు తనపై తనకున్న కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక తప్పు దారుల్లో నడిచింది. జీవితాన్ని దుర్భరం చేసుకొంది. నటనలో సహజత్వాన్ని, అసమాన ప్రతిభను ప్రదర్శించి సంస్థల నుంచీ, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచీ అనేక ప్రసంశలు పొందింది. కాని మానసిక, శారీరక బలహీనతల వల్ల ఒక నటి ఎలా చీకటి కోణాల్లో ఈడ్చివేయబడిందో దేవరాజు ఆమె ఆత్మకథ ద్వారా తెలియజేశారు. సమాజంలో చెడువైఖరిని తొలగించడానికి ఆమె జీవితం ఒక గుణపాఠమని పేర్కొన్నారు.

‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’ లో సమాజ సేవ చేస్తూ మహిళల కోసం వివిధ సంస్థలను స్థాపించి, వారి అభ్యున్నతికి సహకరించిన సామాజిక కార్యకర్తలను దేవరాజు పరిచయం చేశారు. ఇందులో సావిత్రీబాయి పూలే 17 ఏండ్ల వయసులోనే పూనా పరిసర ప్రాంతాల్లో ఐదు పాఠశాలలను, 1851 లోనే ‘మెహర్, మాంగ్’ల బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించింది. నంజనగుడు తిరుమలాంబ ‘తమ కోసం తాము జీవించడం కన్నా, ఇతరుల కోసం జీవించడంలో ఔన్నత్యం ఉంది.’ అని చాటి చెప్తూ స్త్రీ విద్యావశ్యకతకు ప్రయత్నించింది. బాల్య వివాహాల వల్ల చాలా మంది ఆడపిల్లలు, చిన్న వయస్సులోనే వైధవ్యం పొందుతున్న వారి పట్ల సానుభూతిని ప్రదర్శించి వారి పునరుజ్జీవనం కోసం పూనాలో ఒక ఆశ్రమాన్ని స్థాపించింది.

స్త్రీ జనోద్దరణే జీవిత ధ్యేయంగా భావించిన అచ్చమాంబ ‘బృందావనీ స్త్రీ సమాజం’ స్థాపించింది. సాంఘిక కార్యక్రమాల్లో భాగంగా నిరుపమాదేవి ‘బెహరంపూర్’ లో ‘మహిళా సమితి’ ని స్థాపించి, దాని ద్వారా బాలికల పాఠశాలను నిర్వహించింది. విశ్వ సుందరమ్మ జాతీయోద్యమంలో క్రియాశీలకమైన పాత్రను పోషించడమేగాక, నిరాకరణోధ్యమాల్లో, సత్యాగ్రహాల్లో పాల్గొన్నది. బాల్యంలో తన తల్లి చేపట్టిన కార్యక్రమాలతో ప్రభావితురాలైన పుష్పాబెన్ స్త్రీ హక్కుల కోసం, స్త్రీ రక్షణ కోసం తన జీవితాన్ని ధార పోసింది. స్త్రీ తన కాళ్ళ మీద తాము నిలబడితే గాని ఆత్మ విశ్వాసంతో బతుకలేదని గ్రహించిన ఆమె వారి కోసం హాస్టల్స్, హెూమ్స్ నిర్వహించింది. ‘వికాస్ గృహా’ అనే పేరుతో అభ్యుదయ గృహాలను నిర్వహించింది.

ఒక గొప్ప రచయిత్రిగానే గాక సంఘ సేవా కార్యకర్తగా ఇల్లిందల సరస్వతీదేవి ఆత్యస్థెర్యాన్ని, మనోధైర్యాన్ని, కార్యదీక్షను, పట్టుదలను ప్రదర్శించింది. ఆమె గృహిణి పరిధిని దాటి ఒక సృజనకారిగా, ఒక సాంఘిక కార్యకర్తగా ఎదిగింది. బీడి కార్మికుల పక్షాన నిలబడి వారి వారి హక్కులు సాధించడంలో కృషి చేసిన సాంఘిక కార్యకర్తగా ‘సిద్దిఖా బేగం’ కనిపిస్తుంది. ఈ విధంగా ఎంతో మంది భారతీయ మహిళా సామాజిక కార్యకర్తల నుంచి ఎంపిక చేసిన రచనలను, ఆత్మకథలను ఈ గ్రంథంలో దేవరాజు మన ముందు ఉంచారు.

ఈ గ్రంథంలో కనిపించే స్త్రీలందరూ తమ జీవితాలను ఒక సాహసంతో ఎదుర్కొన్న వారే, అందరి బాధలకు ఒకటే నేపథ్యం, స్త్రీగా తమ సాధికారతను నిరూపించుకోకపోవడం, స్వేచ్ఛావకాశాలు లభించకపోవడం, దేవరాజు స్త్రీల జీవితాల్లోని సంఘటనలను వారి ఆత్మ కథల నుంచి, వారి రచనల నుంచి స్వీకరించి మనకు అందించారు. దాదాపు భారతదేశంలో అత్యంత పేరెన్నిక కలిగిన భాషలకు చెందిన రచనలనే గాక, అత్యంత ప్రాచీన భాష సింధినీ కూడా తెలుగులోకి తేవడంలో సఫలీకృతులైనారు. కాలాన్ని, భాషను, వాదాన్ని స్వీకరించడంలో అత్యంత ప్రావీణ్యతను సాధించారు. ఏ భాషలకు చెందిన స్త్రీలైన తన జీవన ప్రయాణపు దారిలో పడిన కష్టాలను, రాల్చిన కన్నీళ్ళను, ఎదుర్కొన్న ఒడిదొడుకులను జీవితాన్ని ఒక ఆశయం కోసం మరల్చుకొన్న ముఖ్య సంఘటలను ఈ గ్రంథం స్పృశించింది.

హిందువైన, ముస్లిం అయిన ఏ మతానికి చెందిన స్త్రీలైన సమాజపు కట్టుబాట్ల మరుగున, పురుషాధిపత్య తెరచాటున జీవితాన్ని గడపవలసి వచ్చిన ధోరణులను 16 వ శతాబ్దం నుంచి నేటి వరకు ఇందులో దేవరాజు విశ్లేషించారు. ఈ గ్రంథంలోని స్త్రీల జీవితాలే గాక, సమకాలీన స్త్రీల జీవన ప్రతిబింబం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆయా కాలాల్లోని స్త్రీల దైనందిన జీవితం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులోని స్త్రీ జీవితాలు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. వారి రచనలు, సంఘ సేవా కార్యక్రమాలు, ఆలోచనా విధానాలు స్త్రీల జీవితానికి విజయగాథలుగా నిలిచాయి. దేవరాజు పేర్కొన్న జీవన నేపథ్యాలు ప్రతి స్త్రీ హృదయాన్ని తట్టిలేపుతాయనడంలో అతిశయోక్తి లేదు.
(అయిపోయింది)

-ఆచార్య వంగరి త్రివేణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page