Former PM Manmohan Singh Passed Away : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపం తెలపనుంది. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- జన్మించిన తేదీ: 26 సెప్టెంబరు 1932
- జన్మస్థలం: మా, పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)
- వివాహం: 14 సెప్టెంబరు 1958
- కుటుంబం: భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్
- విద్యాభ్యాసం: పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా
- కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్
- ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)
- హోనరిస్ కాసా నుంచి డి.లిట్
ఏడు రోజు సంతాప దినాలు.. నేడు సెలవు :
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కీలకంగా పని చేసిన మన్మోహన్ సింగ్, దేశ ఆర్థిక సంస్కరణలను ముందుండి నడిపించారు. క్లిష్టపరిస్థితుల్లో మన్‌మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించాచు. సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు.





