ఓ మహాత్మా మన్నించు..!!

“మహాత్మ మన్నించు..! కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో కేంద్రం అవృద్ది పేరుతో విడుతల వారిగా ఆదివాసులను అన్నల పేరుతో చంపేస్తుంటే.. తెలంగాణలో అభివృద్ది పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విడతల వారిగా హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తుంది.”
అభివృద్ది పేరుతో విధ్వంసం
దేశంలో అభివృద్దికి నిర్వచనమే మారిపోయింది.సంక్షేమం అర్థమే తలకిందులైంది. సంక్షేమ రాజ్యంలో అభివృద్ధి గాడి తప్పింది. సంక్షేమ పేరుతో విధ్వంసం జరుగుతుంది. అభివృద్ధికి ఇప్పుడు అసలైన అర్థం ప్రజల జీవితాలు ప్రకృతి విధ్వంసాలనట్లు మారింది.అభివృద్ధి అంటే వోట్ల రాజకీయాభివృద్దయ్యింది. సంక్షేమమంటే పార్టీల సీట్ల కోసమే అన్నట్లు తయారైంది. దేశంలో అభివృద్దికి కొత్త నిర్వచనం ప్రభుత్వాలు ఇస్తున్నాయి..అభివృద్ది అంటే ప్రజల బతుకులు ఛిద్రం చేసి… చితికిపోయిన బతుకులు కొత్త ప్రభుత్వంలో ‘చితి’కి పంపించమే అన్నట్లుంది.
ప్రభుత్వాలు చెపుతున్న అభివృద్దిలో ప్రజల అభివృద్ది ఉండటం లేదు..సర్కార్‌లు అమలు చేస్తున్న సంక్షేమంలో  పేద మధ్యతరగతి జనాల సంక్షేమం కనిపించడం లేదు..అభివృద్ది అంటే బడా కార్పొరేట్లు, మల్టీనేషనల్‌ కంపెనీ అభివృద్ది అన్నట్లు తయారైంది..సంక్షేమం అంటే పార్టీల సంక్షేమం, రాజకీయ నేతల సంక్షేమమే అన్నట్లుంది.ఇదే ఆధునిక సమాజంలో రాజకీయ పార్టీల నయా సంక్షేమాభివృద్ధి మంత్ర.
సంక్షేమ రాజ్యంలో అభివృద్ది ఫలాలు అందరికి సమానంగా అందాలి.కానీ నయా ఉదారవాద అర్థిక సంస్కరణలతో దేశంలో సంక్షేమం,అభివృద్ది కొన్ని వర్గాలకే పరిమితమైంది.ప్రజల మధ్య అంతరాలు పెరిగాయి. ఫ్యూడల్‌ సమాజంలో కులాల ఆధారంగా ప్రజల మధ్య అంతరాలు పెరిగితే, ఇవాళ ఆర్థికంలో అంతరాలు పెరిగాయి.
దేశంలో ప్రజలను రెండు వర్గాలుగా సంక్షేమ ప్రభుత్వాలు విడదీశాయి.అభివృద్ది సంక్షేమం పేరుతో జనాల మధ్య విభజన రేఖలు గీశాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అంతరాలు మరింత పెరుగుతున్నాయి. సంపద కొద్ది మంది దగ్గర కేంద్రీకృతం కావడమే కాకుండా ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి.
ఇండియాలో విధ్వంసాన్ని ప్రభుత్వాలు అభివృద్ది అంటున్నాయి. మానవ విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్నాయి. ఈ విధ్వంసానికి అందమైన అభివృద్దనే ముసుగేసి యుద్దంలా చేస్తున్నాయి. పాలకులు చెపుతున్న ఈ అభివృద్దిలో ప్రజలుండరు. దోపిడీదారులు, ఆర్థిక నేరస్తులు, అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే ఉంటాయి.
విధ్వంసకర అభివృద్దికి అడ్డుగా ఉన్న చట్టాలను మార్చుతున్నారు..మానవ వినాశకరాభివృద్దిని వ్యతిరేకిస్తున్న వారిపై సంఘ విద్రోహ శక్తులంటూ చంపేస్తున్నాయి..ప్రజా వ్యతిరేక అభివృద్దిని ప్రశ్నిస్తున్న ప్రజలను పోలీసులతో అణచివేస్తున్నాయి.కమీషన్లు, వోట్లు సీట్లు అధికారమే ఎజెండా ప్రభుత్వాలు ప్రజల జీవితాలను అభివృద్ది పేరుతో చిత్రా ,  చేస్తున్నాయి. దీని ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా వినహింపుకాదు.సంక్షేమ దేశంలో అన్నీ ఆతాను మక్కులే.
దేశంలో అభివృద్ది జరగాలంటే నిర్వాసితం కావాల్సిందే. అయితే ఆ నిర్వాసితులకు ఆ అభివృద్దిలో భాగస్వామ్యం దక్కినప్పుడే న్యాయం జరుగుతుంది..కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ది నమూనాలో ప్రజలు నిర్వాసితులైతున్నారు, విధ్వంసకర విధానాల్లో వారి బతుకులు చింద్రమైతున్నాయి. కానీ, అభివృద్దిలో మాత్రం బాధితులకు భాగస్వామ్యం దక్కడం లేదు. అభివృద్ది ఫలాలు అందడం లేదు.
.అయితే అభివృద్ది నమూనాలు రెండు రకాలుంటాయి. ఒకటి విశాల ప్రజల జీవితాలతో ముడిపడున్న అభివృద్ది. కొద్దీ మంది కార్పొరేట్‌ శక్తులకు వారి తొత్తులకు ఉపయోగపడే అభివృద్ది నమూనా. ఇవాళా దేశంలోగానీ, రాష్ట్రంలోగాని జరుగుతున్నదంతా రెండో రకం అభివృద్ది నమూనే.ఆధునిక దేశాభివృద్దిలో దేశ ప్రజలు, మూలవాసులుండరన్నది కళ్లముందున్న సత్యం.
.తెలంగాణలో కూడా ఇప్పుడు విధ్వంసకర అభివృద్ది నమూనా నడుస్తోంది.ప్రజలకు పైసా ఉపయోగం లేని, కేవలం కమీషన్లు, పర్సెంటేజ్‌ల కోసం తీసుకువచ్చే ప్రాజెక్ట్‌లు, నిర్మాణాలు, విగ్రహాల పేరుతో దోచుకునే అభివృద్ది ఎజెండా నడుస్తోంది. సాగు నీటి ప్రాజెక్ట్‌ల వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది.రోడ్లు వేయడం, కాల్వలు తవ్వడం, చెరువులు నిర్మించడం వల్ల మేజార్టీ ప్రజలకు లాభం ఉంటుంది.అలా కాకుండా విగ్రహాలు పెట్టడం దాని కోసం కోట్ల రూపాయాల ప్రజాధనం వృధా చేయడం, ఆ విగ్రహాల సుందరీకరణ కోసం లక్షలాది మందిని నిర్వాసితులను చేయడం,వేలాది కుటుంబాలను రోడ్డు పాల్జేయం అభివృద్ది అనిపించుకోదు. ప్రజల జీవితాలను విధ్వంసం చేయడం అవుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో పావువంతు కూడా అమలు చేయలేదు.రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్‌కు పునాది రాయి వేయలేదు.తట్టేడు మట్టీ ఉన్న ప్రాజెక్ట్‌లో తీయలేదు.వెరసి రాష్ట్రంలో కూల్చివేతలు, పేల్చివేతలతో విధ్వంస పాలన చేస్తున్నారు. రెండేళ్లలో హైడ్రా పేరుతో అరాచకం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌.ఇప్పుడు గాంధీ విగ్రహం పేరుతో మరో విధ్వంసానికి పాల్పడుతుంది.  మూసీ సుందరీకరణ,గాంధీ మానస సరోవర మంటూ అభివృద్ది పేరుతో విధ్వంసానికి ప్రయత్నిస్తుంది.
మహాత్మ మన్నించు.. !కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో కేంద్రం అవృద్ది పేరుతో విడుతల వారిగా ఆదివాసులను అన్నల పేరుతో చంపేస్తుంటే.. తెలంగాణలో అభివృద్ది పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విడతల వారిగా హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తుంది.
.హైదరాబాద్‌ నడిబొడ్డున మహాత్మ గాంధీ విగ్రహం పెట్టేంటేకు ఏకంగా వందల కుటుంబాలను రోడ్డునపడేసే ప్రయత్నం చేస్తున్నారు.అభివృద్ది పనులకు, గ్యారంటీల అమలకు సీఎం ను కోసిన రూపాయి లేదంటున్న రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం కోసం ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది.
నిజానికి గాంధీ ఏనాడు తన విగ్రహాలు పెట్టాలని కోరుకోలేదు.ప్రజల ఇళ్ల కూల్చి తన బొమ్మలు పెట్టాలని చెప్పలేదు. అహింసతోనే అభివృద్ది జరగాలన్నారు..కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం గాంధీ ఆశయాలకు విరుద్దంగా వ్యవహరిస్తుంది..హింస మార్గంలో..బలవంతంగా పేద మధ్యతరగతి ఇళ్లను కాంగ్రెస్ కూల్చుతుంది. ఏకంగా కుటుంబాలకు కుటుంబాలనే నిర్వాసితులను చేస్తుంది.వారి జీవితాలను విధ్వంసం చేస్తుంది..పిల్లలు పెద్దలను మానసికంగా ఇబ్బంది పెట్టుతుంది. ఒక రకంగా గాంధీ పేరుతో వారిపై సైకలాజికల్‌ వార్‌ చేస్తుంది.
అయితే గాంధీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది.మూసీ సుందరీకరణ, గాంధీ విగ్రహాని ముడిపెట్టుతు సుందరమైన హైద్రాబాద్‌ను విధ్వంసం చేస్తూ స్మశాన వాటికలా మార్చుతుంది. ప్రజల సమాధులపై గాంధీ విగ్రహం కట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజల కలల సౌధాలు కూల్చుతు రేవంత్‌ రెడ్డి తన భవిష్యత్‌ రాజకీయ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు.ప్రజల ఇళ్లు కూల్చుతు మహాత్ముడికి గుడి కడుతున్నారు. కానీ ఆ గుడిలో ఉన్న మహాత్ముడిని ప్రజల్లో రాక్షుడిగా రేవంత్‌ రెడ్డి మార్చుతున్నారు.
గాంధీ మానస సరోవరం వల్ల తెలంగాణకు గానీ, స్థానిక ప్రజలకుగానీ పెద్దగా ఉపయోగం లేదు..గాంధీ కూడా ఇలాంటివి కోరుకోలేదు..అయితే మానస సరోవరం ప్రాజెక్ట్‌ వల్ల కొంత మంది పారిశ్రామికవేత్తలకు  ఉపయోగపడుతుంది. అధికార పార్టీ నేతలకు లాభం చేస్తుంది.ప్రాజెక్ట్‌లో పర్సంటేజ్‌లు, కమీషన్లు వస్తాయి.విలువమైన భూములు తన అనుమాయులకు కట్టబెట్టవచ్చు.  హైదరాబాద్‌ ప్రజల గుండెళ్లో గునపాలు గుచ్చుతు గాంధీ విగ్రహం కట్టి పేదల కన్నీళ్లతో అభిషేకం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తుంది. ఇది గాంధీ కలలుగన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు గాడ్సే ప్రభుత్వం.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *