* రైతు బంధు వెంటనే చెల్లించాం
* రుణమాఫీ చేసి రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం
* అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ
* కెసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది
* బనకచర్లపై చర్చకు రెడీ
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే మన పోరాటాలు, త్యాగాలు జరిగాయన్నారు. ఉన్న ఊరిని, సొంత భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తరువాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులన్నారు. ఆనాడు కెసీఆర్ రైతు బందు ఎగ్గొడితే తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7625 కోట్ల నిధులను విడుదల చేసామని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టామన్నారు. 2535 964 మంది రైతులకు రూ. 20617 కోట్లు వారి ఖాతాల్లో వేసి గత ఏడాది ఆగస్టు 15న రుణ విముక్తులను చేశామన్నారు. వరి పండించండి.. చివరి గింజ వరకు కొనడమే కాదు, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మాట ఇచ్చాం. మా మాటపై నమ్మకంతో రైతులు దేశంలోనే అత్యధికంగా వరిపండించే రాష్ట్రంగా నిలబెట్టారు. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారన్నారు. దళారుల దోపిడీని నిలువరించి రైతును ఆదుకున్న చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. సాంబ వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారన్నారు. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మిండ్రు. రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. రైతుల పేరుతో అప్పులు చేసిండు. దోపిడీ చేసిండు. రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టిండు.రైతుల ముసుగులో, రైతు సెంటిమెంట్ ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు, వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు .ఈ వేదిక నుంచి సూటిగా అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్ధిక పరిస్థితి ఏంటి? మొయినాబాద్ లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? జన్వాడలో కేటీఆర్ కు, గజ్వేల్ లో కేసీఆర్ కు ఫామ్ హౌస్ లు ఎట్లా వచ్చినయ్? మీరు వేల కోట్ల అధిపతులు ఎట్లా అయ్యారు? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాళా తీసిందని ఆరోపించారు. పదేళ్లు వాళ్లు చేయలేనిది మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. లెక్కబెట్టుకుంటమంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తానన్నారు. పదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పు కేసీఆర్. 18 నెలల్లో రూ. 1 లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం మాది అన్నారు. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఈ వేదిక నుంచి అడుగుతున్నా. కాళేశ్వరం పేరుతో మీరు లక్ష కోట్లు కొల్లగొడితే, 18 నెలల్లో రైతుల కోసం రూ.1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాదన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహిస్తున్నాం.ప్రజలారా ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి… అంచనా కట్టండి… బేరీజు వేయండి. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్.ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కెసీఆర్ కాంట్రాక్టర్లకు రూ, 2 లక్షల కోట్లు చెల్లించిండు. మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు? రూ. 6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది. దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి. ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? అని ప్రశ్నించారు.
లక్ష కోట్లు దోచుకుని, వేల ఎకరాలు ఆక్రమించుకుని ఇవాళ బనకచర్ల విషయంలో నాపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నేను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని కేసీఆర్. సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజల్తో కదం కదం కలిపా.నీకు చిత్తశుద్ధి ఉంటే. గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి. నువ్వు చెప్పిన తారీకున అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో నువ్వు నేను చర్చ చేద్దాం. మొత్తం వివరాలతో తాను వస్తానని సవాల్ విసిరారు.
లక్ష కోట్లు దోచుకుని, వేల ఎకరాలు ఆక్రమించుకుని ఇవాళ బనకచర్ల విషయంలో నాపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నేను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని కేసీఆర్. సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజల్తో కదం కదం కలిపా.నీకు చిత్తశుద్ధి ఉంటే. గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి. నువ్వు చెప్పిన తారీకున అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో నువ్వు నేను చర్చ చేద్దాం. మొత్తం వివరాలతో తాను వస్తానని సవాల్ విసిరారు.





