రాష్ట్రానికి గోదావరి, కృషా నదులే జీవనాధారం
గోదావరి – బనకచర్లకు ఆనాడే అంకురార్పణ
బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం..
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలో విపక్షాలతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాకు గోదావరి, కృష్ణా నదులే ఆధారమని సీఎం రేవంత్ అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టుపై ఎంపీలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ అన్నట్టు వార్తా పత్రికలో రాశారని సీఎం తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృషా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.
”21-9-2016న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. ఏటా 3వేల టీఎంసీల నీరు వృథాగా గోదావరి నీరు సముద్రంలో కలుస్తోందని అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ అన్నారు. 3వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని మొదట మాట్లాడింది కేసీఆరే. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలో ఉంది. రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు చెప్పారు. గోదావరి-బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నాం. నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. గోదావరి- బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించాం. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతాం. తెలంగాణకు కృష్ణాలో 299 టీఎంసీలు సరిపోతాయని ఆనాడు కేసీఆర్ ఒప్పుకొని సంతకం చేశారు. ఆనాడు కేసీఆర్ చేసిన సంతకం ఇవాళ తెలంగాణకు ప్రతిబంధకంగా మారింది” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.





