– సి.ఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21 తేదీన రాష్ట్రపతి, హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకోని, ఆయా డిపార్ట్ మెంట్ల వారీగా నోడల్ ఆఫిసర్ ను నియమించి నిబంధనల ప్రకారం తగు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టు కు చేరుకుంటారని తదనంతరం రాజ్ భవన్ లో స్వల్ప విశ్రాంతి, గవర్నర్ హై టీ లో పాల్గొని, అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8.00 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరుతారని అధికారులు పేర్కొన్నారు. బ్లూ బుక్, వీవీఐపీ ప్రొటోకాల్ మాన్యువల్ ప్రకారం తగు భద్రతా, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్త్ ప్రణాళికను పోలీస్ శాఖ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వివిఐపిలకు తగు భద్రతా ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. జి.ఎ.డి., ఫైర్ సర్వీస్, రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య, మున్సిపల్, ఇంధన, బి.ఎస్.ఎన్,ఎల్, హార్టి కల్చర్ విభాగాలు నిర్దేశించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి ఈ నెల 21 తేదీన మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని స్వల్ప విరామం కోసం రాజ్ భవన్ లో బస చేసి, అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేసి 22వ తేదీ ఉదయం పుట్టపర్తి పర్యటనకు బయలుదేరుతారని అధికారులు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





