సీఎం పర్యటనతో హుస్నాబాద్​కు ఒరిగిందేమీ లేదు

  • సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా?
  • గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే..
  • మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్

హుస్నాబాద్, ప్రజాతంత్ర,  డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి చూపించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పర్యటనతో హుస్నాబాద్‌కు ఒరిగిందేమీ లేదని, ఇది కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనని ఆయన ఆరోపించారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని సతీష్​కుమార్ పేర్కొన్నారు. పదేళ్లలో 96% రిజర్వాయర్‌ను పూర్తి చేసి, అందులో 1 టీఎంసీ వరకు నీళ్లు నింపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. “కుర్చీ వేసుకుని గౌరవెల్లిని పూర్తి చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ఘనత కేసీఆర్‌ది” అని గుర్తు చేశారు. రిజర్వాయర్ కాలువల భూసేకరణ, నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణ: కాలువలకు రూ. 437 కోట్లు కేటాయించినట్లు చెప్పుకోవడం తప్ప, ఇప్పటివరకు కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారని విమర్శించారు.

హుస్నాబాద్ అభివృద్ధి, ఎన్నికల జిమ్మిక్కులు

గండిపల్లి హామీ: పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు ముందు గండిపల్లిని సందర్శించి, అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, రెండేళ్లు గడిచినా ఆ ఊసు ఎత్తడం లేదని ఆరోపించారు.  అభివృద్ధి వాస్తవాలు: 2014కు ముందు హుస్నాబాద్ ఎలా ఉండేది, తర్వాత ఎలా మారింది అనేది ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. ఎలాంటి అభివృద్ధి జరగకుండానే హుస్నాబాద్ పట్టణానికి పలుమార్లు జాతీయ అవార్డులు ఎలా వచ్చాయని సీఎం, మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నీటి వనరుల అభివృద్ధి: హుస్నాబాద్ నియోజకవర్గంలో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని, మహాసముద్రం గండి, గాడుదులలోద్ది నిర్మాణం చేసింది తామేనని తెలిపారు. శనిగరం ప్రాజెక్టు, చెరువులు, కుంటల మరమ్మత్తులు తమ హయాంలో జరిగాయని చెప్పారు. పక్కాగా ఉన్న దవాఖాన భవనాన్ని కమిషన్ల కోసమే కూల్చివేశారని, చిత్తశుద్ధి ఉంటే కొత్త భవనాన్ని మరోచోట విశాలమైన స్థలంలో నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించారు.  6 గ్యారంటీలను అమలు చేయలేక, 420 హామీలను నెరవేర్చలేక గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి జిల్లా పర్యటన చేస్తూ బహిరంగ సభలు పెడుతున్నారని విమర్శించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు

స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌ది ‘మాటలు ఎక్కువ, పనులు తక్కువ’ అనే చందంగా ఉందని వొడితెల సతీష్ కుమార్ ఎద్దేవా చేశారు. గౌరవెల్లి భూ నిర్వాసితులను రెచ్చగొట్టి ఎకరాకు రూ. 30 లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఇప్పుడు కేవలం రూ. 15 లక్షలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  మంత్రి ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని, కేవలం సంపాదన ధ్యేయంగా పనిచేయకుండా సేవా దృక్పథంతో ప్రజలకు సేవలందించాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ పాలన: తొమ్మిదిన్నర ఏండ్ల తమ పాలనలో రూ. 5649 కోట్ల అభివృద్ధి, రూ. 3427 కోట్ల సంక్షేమాన్ని అందించిన ఘనత తమకే దక్కుతుందని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *