యాచక రహిత నగరానికి జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు ప్రధాన కూడళ్ళలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్‌ హోమ్‌లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఆదేశాలమేరకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రధానంగా, బషీర్‌బాగ్‌, సెక్రెటరియేట్‌, నాంపల్లి, బేగంబజార్‌ తదితర ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద ఉండే యాచకులు, ఫుట్‌పాత్‌లపై ఉండే వారిని గుర్తించి జీహెచ్‌ఎంసీ నిర్వహించే షెల్టర్‌ హోమ్‌ లకు తరలించారు. మిగిలిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని తమ స్వగ్రామాలకు, నివాసాలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని, జీహెచ్‌ఎంసీ అర్బన్‌ కమ్యూనిటీ విభాగం (యూసీడీ) ఆధ్వర్యంలో రెండుమూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, మతపరమైన ప్రదేశాలలో భిక్షాటన చేసే వారి గురించిన సమాచారం అందుకొని వారిని వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జీహెచ్‌ఎంసీ షెల్టర్‌ హోమ్స్‌కు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిరోజులుగా యుసిడీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాచకుల తరలింపులో 221మందిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37మంది స్త్రీలు, 11మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 19మందిని జీహెచ్‌ఎంసీ షెల్టర్‌ హోమ్‌కు తరలించగా మిగిలిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇందుకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్‌ఎంసీ యూసీడీ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *