పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టరా?

గురుకులాల్లో విద్యార్థుల పస్తులు
కాంగ్రెస్ పాల‌నతో గురుకులాలు అస్త‌వ్య‌స్తం
మెస్‌ చార్జీలు పెండింగ్‌లో పెట్టిన రేవంత్ కు శిక్ష వేయాలి
మాజీ మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 12 :  3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేద‌ని, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలుగా మెస్ చార్జీల విడుదల చేయకపోవడం దుర్మార్గమ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. మెస్‌ చార్జీలు పెండింగ్‌లో పెట్టిన రేవంత్ రెడ్డికి శిక్ష వేయాల‌ని తెలిపారు. విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నావా? అంటూ ప్ర‌శ్నించారు.  సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు వేరు. ఫోర్త్ సిటీ,ఆరు లైన్ల రోడ్డు వాళ్ల‌ భూముల వ‌ర‌కు వేసుకోవడమే వారి ప్రాధాన్యతలు. కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరుతో వృథా చేశారని అన్నారు.

రేవంత్ రెడ్డి ఏడాది పాలనతో గురుకులాలు, హాస్టళ్ళు ఆగమైపోయాయ‌ని, వేలాదిమంది విద్యార్థులు ద‌వాఖాన‌ల‌ పాలయ్యారన్నారు. 49 మంది విద్యార్థులను ఈ ప్ర‌భుత్వం పొట్టనపెట్టుకుంద‌ని మండిపడ్డారు.  కెసిఆర్ 1000 పైగా గురుకులాలు స్థాపించి గురుకులాల గౌరవాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తులో పెట్టారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలుగా మెస్ చార్జీల చెల్లింపులు జరగలేదు. దాదాపు తొమ్మిది లక్షల 50 వేల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు బంగారం కుదువబెట్టి అప్పులు తెచ్చి విద్యార్థులు ఆకలి తీరుస్తున్నారు. మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా పెడతారు? విద్యార్థుల ద‌వాఖాన‌ల పాలైతే ఉపాధ్యాయులను, వార్డెన్లను సస్పెండ్ చేస్తా అంటున్నారు. శిక్ష రేవంత్ రెడ్డికి వేయాలి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు మిస్ చార్జీలు విడుదల చేయలేదు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప కూడా దాటవు. గత సంవత్సరం విద్యార్థులకు ప్లేటు, గ్లాస్, స్పూన్ టవల్స్, స్కూల్ యూనిఫార్మ్స్ అన్ని సకాలంలో అందాయి. ఈ సంవత్సరం ఇవేవీ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అని మాజీ మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.

రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ పుట్టిన రోజుకు ఫుల్ పేజీ పేపర్ యాడ్ ఇస్తున్నారు. తొమ్మిది రోజుల విజయోత్సవాలు జరుపుకున్నారు. కానీ ఈ పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టే చేతకాదా? అని ప్ర‌శ్నించారు. ఆడపిల్లల హాస్టళ్ల లో చలికాలం వేడి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారని, ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్, నవంబర్ మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. పార్ట్ టైం ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, 8 నెలల నుంచి జీతాలు చెల్లించకపోతే వారు ఎలా పని చేస్తారని అన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలలుగా కాస్మెటిక్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయని, ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలన! కోతలు ఎక్కువ చేతలు తక్కువ అని ఎద్దేవా చేవారు.

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, .. వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్ వల్ల బాలికలు ద‌వాఖాన‌ల‌ పాలైతే వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమ‌ని అన్నారు. ఏడాది నుంచి హాస్టల్ భవనాలకు అద్దెలు చెల్లించడం లేదని, . వెంటనే రెంట్లను చెల్లించాల‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వొచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను విస్మరించార‌న్నారు. కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరుతో వృథా చేశార‌ని, పిల్లలు తినే అన్నం చూస్తే ఆవేదన కలిగింద‌న్నారు. కెసిఆర్ హాస్టల్లో విద్యార్థులకు కడుపునిండా సన్న బియ్యంతో భోజనం పెట్టారని గుర్తు చేశారు.  మీరు దొడ్డు బియ్యంతో అన్నం విద్యార్థులు తినలేకపోతున్నార‌ని చెప్పారు.  పాలన అంటే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం కాద‌ని, పాలన అంటే ఇచ్చిన హామీలను అమలు చేయడమ‌ని, ఇప్పటికైనా పేద విద్యార్థులకు క‌డుపునిండా అన్నం పెట్టాల‌ని హ‌రీష్ రావు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page