– ఒకప్పుడు భిక్షాటనే వృత్తి
– నేడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నవైద్యులు
– గ్రామంలో 50 మంది వరకు ఆర్ఎంపీ డాక్టర్లు
– ఇదొక సామాజిక మార్పు కథ
జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ఒకప్పుడు భిక్షాటనకు చాపిన చేతులు నేడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చేతులుగా మారా ఒకప్పుడు చిలక పంచాంగం చూసి భవిష్యత్తు చెప్పిన వాళ్లు.. ఇప్పుడు స్టెతస్కోప్ ధరించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇది ఒక సామాజిక వర్గానికి చెందిన మార్పు కథ. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని కన్నాపూర్ గ్రామం నేడు డాక్టర్ల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ చిన్న గ్రామంలోనే 50మందికిపైగా ఆర్‌ఎంపీ వైద్యులు ఉన్నారు. ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో కనీసం ఒక డాక్టర్ గారు తప్పక ఉంటారు. గ్రామంలో బేడ, బుడగ జంగాల సామాజికవర్గ ప్రజలు అధికంగా ఉన్నారు. వీరి సంప్రదాయ వృత్తి సంచార జీవితం, చిలక పంచాంగం, జాతకాలు చెప్పడం, బుర్రకథలు చెప్పడం.. పుణ్యక్షేత్రాల వద్ద భిక్షాటన. ఒకప్పుడు ఇది జీవనోపాధి అయినా కాలక్రమంలో ఈ వృత్తి పట్ల సమాజంలో చులకన భావన పెరిగింది. ఇదే సమయంలో అర్ధ శతాబ్దం క్రితం గ్రామానికి చెందిన కొందరు యువకులు భిక్ష అడగడం కాదు.. సేవ చేయాలి అనే ఆలోచన చేశారు. ఆలోచన వచ్చిందే తడవు దాన్ని వైద్య సేవ రూపంలో ఆచరణలో పెట్టారు. వారిలో విభూది శివరాజం, నామ్ సింహాద్రి, నామ్ రాజం, కడమంచి రామచంద్రం, నామ్ శివరాం మొదటి తరపు మార్గదర్శకులు. వైద్య శిక్షణ పొంది ఆర్‌ఎంపీ డాక్టర్లుగా సేవలు ప్రారంభించారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. వైద్య సేవల ద్వారా గౌరవం, ఆదాయం రెండూ రావడం చూసి గ్రామంలోని ఇతర యువత కూడా అదే దారిని పట్టారు. ‘మా వృత్తి ప్రజలకు ఉపయోగపడాలి.. మన పిల్లలు ఇక భిక్ష అడగాల్సిన అవసరం రాకూడదు అని పెద్దవాళ్లు నిర్ణయించుకున్నారు. తద్వారా క్రమంగా సుమారు 50 మంది ఆర్‌ఎంపీ వైద్యులు గ్రామంలో తయారయ్యారు. ఇప్పుడు వీళ్లు జగిత్యాల జిల్లా అంతటా వివిధ గ్రామాల్లో వైద్య సేవలందిస్తున్నారు. జ్వరాల నుంచి ప్రాథమిక చికిత్సల వరకు కన్నాపూర్ డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కన్నాపూర్ యువత వైద్య రంగంతోపాటు ఫోటో స్టూడియోలు, వీడియోగ్రఫీ, డిజిటల్ మీడియా రంగాల్లోనూ అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. వివాహాలు, శుభకార్యాల్లో వీరి సేవలకు డిమాండ్ ఎక్కువ. ఒక్క శివరాజం, సింహాద్రి, శివరాంల సంకల్పం ఒక గ్రామం దిశ మార్చింది. ఒక్క ఆలోచనతో ప్రారంభమైన మార్పు ఇప్పుడు మొత్తం సమాజానికి ఆదర్శంగా మారింది. ఇది ఒక్క ఊరి కథ మాత్రమే కాదు.. వీరిని ఆదర్శంగా తీసుకొని జగిత్యాల జిల్లాతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారు భిక్షాటన విడిచిపెట్టి ఇతర వృత్తి, వ్యాపారాలను ఎంచుకుని తమ జీవనాన్ని గడుపుతున్నారు. గౌరవనీయమైన జీవితాన్ని సాధించిన కన్నాపూర్ గ్రామ ప్రజలు నేటి యువతకు ఒక స్ఫూర్తి పాఠం చెబుతున్నారు. జీవితం మారాలంటే వృత్తి మారాలి.. సేవే శ్రేష్ఠమైన మార్గం అంటున్నారు. కన్నాపూర్ కథ ఒక సాధారణ గ్రామ గాధ కాదు.. అది ఒక సమాజ పునర్జన్మ.. భిక్ష అడిగే చేతులు ఇప్పుడు సేవ చేసే చేతులయ్యాయి.
గౌరవంగా సేవ చేస్తారు
– తొలి తరం డాక్టర్, మాజీ సర్పంచ్ నామ్ శివరాం
మా సమాజం ఒకప్పుడు సంచార జీవనం గడిపేది. కానీ మేము ఆ చరిత్రను మార్చేశాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వారమయ్యాం. ఇక మా పిల్లలు భిక్ష అడగరు. వారు గౌరవంగా సేవ చేస్తారు అని గర్వంగా చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




