సమర్ధవంతంగా పనిచేయాలి

– నేరాల‌ను అరిక‌ట్ట‌డంపై దృష్టి పెట్టాలి
–  సీఐడీ ప‌నితీరుపై  అధికార్ల‌కు డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి సూచ‌న‌లు

– ఐదేళ్ల నేర వివ‌రాలు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త విభాగాల ప‌నితీరుపై సమీక్ష

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 25: క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ (సిఐడి) విభాగపు పనితీరును రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి.శివధర్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో సమీక్షించారు. సిఐడి అడిషనల్ డిజిపి చారుసిన్హా , డిఐజి నారాయణ నాయక్, సిఐడి విభాగపు ఎస్పీలు, సంబంధిత అధికారులు డిజిపి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. సిఐడి విభాగంలో ఉన్న ఎస్సిఆర్బి, పిసిఆర్, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, సీసీటీఎన్ఎస్ , విమెన్ సేఫ్టీవింగ్ ల పనితీరును సమీక్షించడంతోపాటు గత ఐదు సంవత్సరాల నేరాల వివరాలను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న నేరాలు, స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరుగుతున్న నేరాలను, వాటికి గల కారణాలను విశ్లేషించాలని డిజిపి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతున్న నేరాలను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న సంఘటనలపై సిఐడి దృష్టిసారించి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిజిపి సూచించారు. రానున్న సంవత్సరంలో సిఐడి దృష్టి పెట్టేనేరాన్ని ఆ సంవత్సరపు ప్రధాన లక్ష్యంగా పరిగణించాలని, దానిని నియంత్రించడంతో పాటు ఇతర నేరాలను అరికట్టాలన్నారు. వివిధ విభాగాల అధికారులు నేరాలను విశ్లేషించి సమర్థంగా పనిచేస్తే కిందిస్థాయి సిబ్బంది కూడా మరింత నైపుణ్యంగా పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేరాలను రికార్డు చేసే సందర్భంలో వాటిని క్షుణ్ణంగా విశ్లేషించాలని, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దాడులు, మోసాలు, వంటి నేరాలలో అవి ఏ రకమైనవో రికార్డు చేయడం ద్వారా నియంత్రించే మార్గాలను అన్వేషించవచ్చన్నారు. దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్ ల వివరాలను సేకరించాలన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ల తప్పిదం ఏమైనా ఉంటే కారణాలు తెలుసుకోవాలని, పోలీసు డ్రైవర్ల విషయంలో కంటి చూపు కారణంగా ప్రమాదాలు జరిగితే వారికి కంటి పరీక్షలు చేసే విధంగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని డిజిపి సూచించారు. సిఐడి ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, మద్దిపాటి శ్రీనివాస్, వెంకటలక్ష్మి, రామిరెడ్డి,శ్రీనివాస్ తదితరులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

‌డిసిపిపై దాడికి దిగిన స్నాచర్‌ ..‌కాల్పులు జరపడంతో దొంగకు గాయాలు

హైదరాబాద్‌ ‌మహానగరంలో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్‌ ‌ప్రాంతంలో సెల్‌ఫోన్‌ ‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సౌత్‌ ఈస్ట్ ‌డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నించగా.. డీసీపీ స్వయంగా కాల్పులు జరిపారు. సెల్‌ఫోన్‌ ‌స్నాచింగ్‌ ‌చేస్తున్న దొంగను పట్టుకోవడానికి డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దొంగ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ తోపులాటలో డీసీపీ గన్‌మ్యాన్‌ ‌కిందపడటంతో, డీసీపీ చైతన్య వెంటనే గన్‌మ్యాన్‌ ‌వద్ద ఉన్న ఆయుధాన్ని తీసుకొని సెల్‌ఫోన్‌ ‌స్నాచర్‌పై కాల్పులు జరిపారు. డీసీపీ చైతన్య ఆ దొంగపై రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక దొంగకు గాయాలు కావడంతో వెంటనే అతడిని నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. మరొకరు తప్పించుకున్నారు. ఈ ఘటనలో డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *