మృత్యు విహంగం..!

-అహ్మ‌దాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా  విమానం
– 242 మంది మృతి
– టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే ప్రమాదం
-జ‌నావాసాల‌పై ప‌డిన విమానం
– మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం

అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171 ఘోర ప్ర‌మాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ర‌న్‌వే23 నుంచి స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.39 గంట‌ల‌కు టేకాఫ్ అయిన వెంట‌నే  ప్ర‌మాదానికి గురైంది. ఆ స‌మ‌యంలో పైలెట్ల‌నుంచి మేడే కాల్ (డిస్ట్రెస్ కాల్‌) వ‌చ్చిన‌ట్టు పౌర విమాన‌యాన‌శాఖ వ‌ర్గాలు తెలిపాయి. త‌క్ష‌ణం ఏటీసీ స్పందించినా అవ‌త‌ల‌వైపు నుంచి స్పంద‌న రాలేద‌ని, విమానం కూలిపోయి ద‌ట్ట‌మైన పొగలు వ్యాపించాయ‌ని చెబుతున్నారు. ఇందులో దాదాపు 242మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మేఘానిలో ఎయిర్‌ఇం‌డియా విమానం కూలిపోయింది. టేకాఫ్‌ అయిన వెంటనే విమానం  సివిల్‌ ‌హాస్పిటల్‌కు స‌మీపంలోని చెట్టును ఢీకొట్టిన అనంతరం విమానం జనావాసాలపై కూలి పోయింది.  విమాన  ప్ర‌మాదాన్ని ఎయిర్‌ ఇం‌డియా కూడా ఎక్స్ ‌వేదికగా ప్రమాదాన్ని ధ్రువీకరించింది.

విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌, ఏడుగురు పోర్చుగీస్‌ ‌జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు  వెల్లడించింది.  ఇందులో గుజరాత్‌ ‌మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ కూడా ఉన్నారు. అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించారు. బిఎస్‌ఎఫ్‌ ‌సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.  పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.  సంఘ‌ట‌న స‌మాచారం అందిన వెంట‌నే కేంద్రమంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు గుజరాత్‌ ‌కు బయల్దేరారు. ప్రమాదంపై గుజరాత్‌ ‌సిఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా ఫోన్‌ ‌చేసి ఆరా తీశారు. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన క్ష‌ణాల్లోనే  మేఘాని నగర్‌ ‌ఘోడాసర్‌ ‌క్యాంప్‌ ‌ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటిపొగ అన్ని వైపులకు వ్యాపించింది. ఫ్లైట్‌ ‌రాడార్‌ 24 ‌ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ ‌కోల్పోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం1.39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొన్నట్లు ప్రాథమిక అంచ‌నా. ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్‌ 787 ‌డ్రీమ్‌ ‌లైనర్‌. ‌

దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ విమానాన్ని త‌యారుచేసింది బోయింగ్ 787-8 సంస్థే! విమాన కూలిన విషయం తెలియగానే ఫైర్‌ ఇం‌జిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకొన్నారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌సివిల్‌ ఏవియేషన్‌ (‌డీజీసీఏ) స్పందించింది. విమానానికి కెప్టెన్‌గా సుమిత్‌ ‌సబర్వాల్‌, ‌ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్‌ ‌కుండర్‌ ‌వ్యవహరించినట్లు పేర్కొంది. సుమిత్‌కు ఎల్‌టీసీగా 8,200 గంటలు, కోపైలట్‌కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు వెల్లడించింది.

ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్‌వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది. కొద్ది సేపటికే ఆ ఎయిర్‌ ‌క్రాప్ట్ ‌నుంచి ఏటీసీకి మేడేకాల్‌ (అత్యవసర కాల్‌) ‌వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత కూలిపోయినట్లు పేర్కొంది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్‌లైన్‌ ‌నెంబర్‌ 1800 5691 444 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ సామాజిక మాధ్యమం, ఎయిర్‌ఇం‌డియా వెబ్‌సైట్‌లో కూడా ప్రమాద వివరాలు, అప్‌డేట్లు ఉంటాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపేశారు. అహ్మ‌దాబాద్ ప్ర‌మాదాన్ని ఒక విషాద సంఘ‌ట‌న‌గా భార‌త విదేశాంగ‌శాఖ పేర్కొంది. అయితే విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీన్ జైస్వాల్ మృతుల సంఖ్య‌పై స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నందున‌, మృతుల వివ‌రాలు తెలిసేస‌రికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *