సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు

హైడ్రాపై ఎమ్మెల్యే ఆరికెపూడి ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: మాదాపూర్‌ సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు సోమవారం తొలగించారు. ఎఫ్‌టిఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా రూ.10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో భారీగా ఆక్రమణలు జరిగాయి. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను కూడా తొలగిస్తున్నారు. చెరువు సమీపంలో ఏళ్లతరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. ఇటీవల చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా,కూల్చివేతలను స్థానికులు యంత్రాలకు అడ్డుగా పడుకుని అడ్డుకునే యత్నం చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సున్నం చెరువు వద్దకు వెళ్లి హైడ్రా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. ఈ కూల్చివేతలపై సీఎం రేవంత్‌ను కలుస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *