- టీచర్ల కుదింపుతో సర్కారు బడులపై తీవ్ర ప్రభావం
- ప్రభుత్వం తక్షణమే ఆ ఉత్తర్వులు విరమించుకోవాలి
- డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీరని నష్టం వాటిల్లుతుందని, టీచర్ల సర్దుబాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (Democratic Teachers Federation) రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస రెడ్డి,హనుమకొండ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గాదరి ఉప్పలయ్య, కటుకూరి శ్రీనివాస్ లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే,మరోవైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీ చేయడమేమిటని ప్రశ్నించారు.
వేసవి కాలమంతా ఉపాధ్యాయులకు,అధికారులకు శిక్షణ, బడిబాట పేరుమీద అనేక కార్యక్రమాలు చేపడుతూనే మరొకవైపు విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో టీచర్లను వేరే పాఠశాలలకు సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలపై తీవ్రమైనప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఉండాలని చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించడం సరికాదని అన్నారు. సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా, పదిమంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు.. అదేవిధంగా 60 మంది విద్యార్థుల వరకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలనడం పూర్తిగా అశాస్త్రీయం, అసంబద్ధం అని అన్నారు. ఒకటి నుంచి 5వ తరగతులకు 18 సబ్జెక్టులు, 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యా బోధన సరైన రీతిలో చేయగలుగుతారని ప్రశ్నించారు. ఈ చర్యలన్నీ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటుకు అప్పగించే విధానాలే తప్ప మరొకటి కాదాన్నారు. అదే ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఉండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపించడం జరుగుతున్నదన్నారు.
కావున ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాకుండా తరగతి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక గది ఉండేలాగా చూస్తూ వీటికి విరుద్ధంగా విడుదల చేసినటువంటి ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని లేకపోతే ఉద్యమ కార్యక్రమం చేపడతామని తెలియజేయడం జరిగింది. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30 అనేది కేవలం ఉన్నత పాఠశాలకే పరిమితం చేయాలని, ప్రాథమిక పాఠశాలకు ఈ నియమం వర్తింపజేస్తే ప్రాథమిక విద్య పూర్తిగా నిర్వీర్యమవుతుందన్నారు. ఉన్నత పాఠశాలలో కూడా సెక్షన్ల వారిగా ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించాలని, భాషా ఉపాధ్యాయులను కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాకుండా సెక్షన్ ల ప్రకారం చూడాలన్నారు. ఈ చర్యలతో పాటుగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి,విద్యారంగానికి బడ్జెట్ పెంచి అవసరమైన మేరకు ఉపాధ్యాయుల నియామకం,మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.





