అమ్మకానికి ప్రజాస్వామ్యం 

“ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది..గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజల మధ్య స్నేహ సంబందా లుంటాయి వంటి అందమైన అబద్దాలను పాలక వర్గాలు, గ్రామాల్లో ఆధిపత్య వర్గాలు చెపుతాయి..ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు, బలహీనపర్చుతుంది. గ్రామాల్లో మళ్లీ ఆధిపత్యం పెరుగుతుంది..శాంతి భద్రతలు కాపాల్సింది ప్రభుత్వం. శాంతి భద్రతాల పేరుతో ఏక గ్రీవాలను ప్రోత్సహించడం వోటుకు నోటు విధానాన్ని ఎంకరేజ్ చేయడమే అవుతుంది.”

దేశంలో పాలకులు ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టారు.ఎన్నో త్యాగాలు, ఎందరో ఆత్మబలిదానాలతో  సిద్దించిన ప్రజాస్వామ్యం ఇప్పుడు  అంగట్లో సరుకైంది. భారత ప్రజాస్వామ్యాన్ని సరుకుగా మార్చి పాలకులు బహిరంగ మార్కెట్లో గంపగుత్తగా సేల్స్ కు పెట్టారు. దేశ స్వాతంత్య్రం వెనుక అనేక పోరాటాలున్నాయి. త్యాగాలు, ఆత్మబలిదానాలున్నాయి. స్వాతంత్య్రం  తో పాటు ప్రజాస్వామ్యం దేశానికి రెండు కాళ్ళులా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.కానీ నేడు ఆ రెండు కాళ్ళను పాలకులు తమ విధానాలతో క్రమంగా విరిచేస్తు, దేశాన్ని అవిటి తనంగా మార్చుతున్నారు. ప్రజల  స్వాతంత్య్రం  , పౌరహక్కులను హరిస్తున్నారు.  గల్లీ నుండి దిల్లీ దాకా పల్లే నుంచి పట్టణం దాకా రాజ్యాంగాన్ని బహిరంగా ఖూనీ చేస్తున్నారు.ప్రజాస్వామ్య పునాదులు పెకిలిస్తూ బలహీనపర్చుతున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని  రక్షించాల్సిన న్యాయ దేవతకు పాలకులు గంతలు కట్టడంతో ఇవేవి చూడటం లేదు.
ప్రజల చేత,  ప్రజల కొరకు,  ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనమని అమెరికా హక్కుల తత్వవేత్త చెప్పారు..కానీ ఇవాళ ప్రజాస్వామ్యం అంటే వోట్లను కొనడం..పదవులు కొనడం, కొంత మంది అధికారం తమ హక్కుగా భావించడం, అందుకోసం ఏకంగా ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయడమే అసలైన ప్రజాస్వామ్యంగా భావిస్తున్నారు.
భారత దేశం పార్లమెంట్ ప్రజాస్వామ్యం..ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయి..ప్రజలు వోట్లేసి గెలిపించిన నాయకులుంటారు..ఎంపీ, ఎమ్మెల్యేలు, సర్పంచ్,  వార్డు సభ్యుల ఎంపికకు వోట్లేయడం ఒక్కటే మార్గం..ఇదే అసలైన ప్రజాస్వామ్యం. అయితే కొంతకాలంగా ప్రజాస్వామ్యాన్ని పాలకులు బహిరంగంగా ఖూనీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అంగట్లో అంగడి సరుకుగా మార్చి బహిరంగ వేలాని వేస్తున్నారు.. వోటర్లను ఓపెన్ గానే కొనుగోలు చేస్తున్నారు..వోటుకింతా వార్డు కింతా, సర్పంచ్ కింత అని ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.ఎంపీ కింతా, ఎమ్మెల్యే, మంత్రులకింత అని ఓపెన్ మార్కెట్లో బహిరంగ వేలం పాట పాడుతున్నారు.
 తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అవుతుంది. ఏక గ్రీవాల పేరుతో రాష్ట్రంలో సర్పంచ్‌ కుర్చిలు, ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టారు. గ్రామంలో వోట్లను బహిరంగా వేలం వేస్తున్నారు. జనాభాను బట్టి ఏకగ్రీవానికి అంత డిమాండ్ ఉంది. ఒక రకంగా సర్పంచ్‌ పదవులను పాలకులు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టారు. డిమాండ్‌ బట్టి రేట్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. అసహజ పోటీకి తెర తీస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో, అందులోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏకగ్రీవాలు అనేది  రాజ్యాంగ స్పూర్తికి ప్రమాదం. ఏక గ్రీవ సంస్కృతి అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదే.ప్రజాప్రాధినిత్య చట్టానికి విరుద్దం. ఏక గ్రీవాలనేది  వోటు కు  నోటు  లాంటిదే..గ్రామంలో ఎన్ని వోట్లున్నాయి. ప్రతి వోటుకు ఇంతా అని లెక్కగట్టి వేలం వేయడమే అవుతుంది.
వోటు కు  నోటు దేశంలో అతిపెద్ద క్రైమ్‌..పోల్‌ మేనేజ్‌మెంట్ వంటి అందమైన కార్పొరేట్‌ పదజాలం వాడుకలోపెట్టిన అది ఓపెన్‌గా వోట్లుకోనడమే..ఇది దేశ ద్రోహం.. గ్లోబలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌, కార్పొరేటైజేషన్‌ విస్తృతంగా అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలు, వోట్లు కార్పోరేట్‌ జూదం అయింది. పదవులు బహిరంగా మార్కెట్‌లో దొరికే వస్తువులయ్యాయి. డిమాండ్ ను బట్టి వాటికి రేట్లు కట్టడం కార్పొరేట్‌ వ్యవస్థకు అలవాటుగా మారింది. లాభాల పేరుతో వస్తువులు అమ్మడం కోనుగోలు చేసినట్లు..అధికారం కోసం వోట్లు కోనడం అమ్మకడం కూడా వ్యాపారంగా మారింది. ప్రభుత్వాలను, ప్రజాప్రతి నిధులను ఎన్నుకోవడం పౌరుల ప్రాధమిక హక్కు..అందుకు వోటు అనేది ఒక సాధనం.ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మోహటంగా బ్యాలెట్‌ ద్వారా వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ నేడు ఆ హక్కును ఏక గ్రీవాలతో గ్రామ పెద్దలు కొనుగోలు చేస్తున్నారు. రాజకీయ ఆర్థిక, అంగబలంతో పాటు బెదిరింపులు ఏక గ్రీవాల వెనుక ఉన్నాయి.
ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది..గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజల మధ్య స్నేహ సంబందాలుంటాయి వంటి అందమైన అబద్దాలను పాలక వర్గాలు, గ్రామాల్లో ఆధిపత్య వర్గాలు చెపుతాయి..ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు, బలహీనపర్చుతుంది. గ్రామాల్లో మళ్లీ ఆధిపత్యం పెరుగుతుంది..శాంతి భద్రతలు కాపాల్సింది ప్రభుత్వం. శాంతి భద్రతాల పేరుతో ఏక గ్రీవాలను ప్రోత్సహించడం వోటుకు నోటు విధానాన్ని ఎంకరేజ్ చేయడమే అవుతుంది. అంతేకాదు ఏకగ్రీవ సంస్కృతి ఫ్యూడల్‌ సంస్కృతి. గ్రామాల్లో కులు విభజనకు కారణమయ్యే సంస్కృతి. ఏకగ్రీవాలు ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోవడమే..వోటు హక్కుతో తమ అభిప్రాయన్ని వ్యక్తం చేయకుండా అడ్డుకుని, కుల,సామాజిక బంధాలతో నిర్భంధం చేయడమే.
అటు ఏకగ్రీవాలు అనేది పార్లమెంట్ ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం.దీంతో మళ్లీ గ్రామంలో, అంతిమంగా దేశంలో నియంతృత్వానికి దారి తీసుంది. గ్రామాల్లో ఇప్పటికీ కుల కుల వ్యవస్థ కొనసాగుతుంది.భూస్వామ్య విధానాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.రూపం మారిన ఇంకా నిచ్చేలమెచ్చ కుల వ్యవస్థ ఉంది.అసమానత్వం, అణివేతలు ఉన్నాయి.రెండు గ్లాసుల విధానం లేకపోయిన ప్రజల మధ్య అంతరాలు కనిపిస్తున్నాయి. అన్ని సామాజిక ఆర్థిక రాజకీయ అణివేతలు లేకుండా, అందరికి సమాన హక్కులు దక్కాలని, దానికి వోటు  ఒక్కటే పరిష్కారమని అంబేడ్కర్‌ లాంటి మహనీయుడు చెప్పారు. చెప్పడమే కాదు, రాజ్యాంగంలో అందుకు అందుకు సంబంధించిన అంశాలను పొందుపరచారు.  కానీ నేడు అంబేడ్కర్‌ చెప్పిన రాజ్యాంగానికి విరుద్దంగా ఏకగ్రీవాలను పాలకులు జరుపుతున్నారు. గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ, బహుజనుల వోట్లను మళ్లీ ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు, ఆర్దికంగా బలంగా ఉన్నవారు ఏకగ్రీవాల పేరుతో హక్కులను కొనుగోలు చేస్తున్నారు.
గ్రామాలకు మంచి చేయాలని కోరుకునే వారు, గ్రామాభివృద్ది కోసం పాటుపడి మంచి నాయకుడిగా గుర్తింపు పొందేందుకు అసలీ ఏకగ్రీవా లెందుకు..?. ఇవాళ కోట్లు పెట్టి గ్రామాన్ని గుంపగుత్తగా కోనుగోలు చేసిన వ్యక్తి పేరు గ్రామం కోసం ఏం పని చేస్తారు..?.కోట్లు పెట్టి సర్పంచ్‌ సీటు కోనుకున్న వ్యక్తి రేపు ప్రజల భాగోగులు ఏలా చూస్తారు..?.డబ్బులు పెట్టి పదవి కోనుకున్న వ్యక్తి డబ్బు సంపాదనపై కాకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనల ఏలా వస్తుంది.?
అంతేకాదు గ్రామా పంచాయతీల ఏకగ్రీవాలు యువతను రాజకీయాల్లోకి రాకుండా చేయడమే అవుతుంది..యువత రాజకీయాల్లో రావాలని విజ్ఞప్తి చేసే పార్టీలు ఎన్నికలను ఏక గ్రీవాలు చేస్తే వారు రాజకీయాల్లోకి ఏలా వస్తారు..?. లక్షలు, కోట్లు పెట్టి సర్పంచ్‌ పదవులు వారు ఏలా కొనుగోలు చేస్తారు.?. గ్రామాలు మార్చాలి, దేశాన్ని మార్చాలనే కళలుకనే యువత కోట్లతో ప్రజాస్వామ్యాన్ని బహిరంగా వేలంలో కొనుకునే శక్తి ఉంటుందా..? ప్రజాసేవకు, రాజకీయాల్లోకి రావడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలే తొలి అడుగు..అలాంటిది కోట్లతోనే అడుగులు వేయడం యువతకు సాధ్యమైతుందా..?
.ఏగగ్రీవాలతో  గ్రామాల్లో బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, వెనుకబడిన వర్గాలు సర్పంచ్‌ సీటును కోనుగోలు చేసే చాన్స్‌లేదు.లక్షలు కోట్లు పెట్టి పోటికి ముందుకు రారు. అంతేకాదు రిజర్వుడు స్థానాల్లో ఏక గ్రీవాల పేరుతో గ్రామాల్లో ఆధిపత్య వర్గం బలహీన వర్గంలో చీలికలు తెచ్చి అదే గ్రామంలో  మరో వ్యక్తిని తెర వెనుక నుంచి బలపర్చుతారు. దీనికి తాత్కాలికంగా గ్రామాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు తన అనుకూల వ్యక్తిచేత సర్పంచ్‌ సీటును కోనుగోలు చేసేలా ఆర్థికంగా అండగా ఉంటూ ఎంకరేజ్‌ చేసి తర్వాత మళ్లీ చక్రం తిప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలన్న వారికి రాజకీయ ఆవకాశాలు అందని ద్రాక్షగానే మిగులుతుంది.
ఒకవైపు ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం, ప్రత్యేక్ష ఎన్నికల కోసం ఆయా దేశాల్లో యువత పోరాటాలు చేస్తుంటే, ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తుంటే,ఏకంగా సీఎం, పీఎం, రాష్ట్రపతి వంటి పదవులకు ప్రత్యేక్షంగా ఎన్నికలు నిర్వహించాలని దేశంలో డిమాండ్ వస్తున్న తరుణంలో ఇవాళా ఏకగ్రీవాలతో గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టడం ప్రమాదకర ఘంటికలు.ఏకగ్రీవాలేవి ప్రజాస్వామ్యానికి పునాదలు కాదు, నియంతృత్వానికి, గ్రామాల్లో ఆధిపత్య వర్గాలు కొల్పోయిన ఆధిపత్యం మళ్లీ తిరిగి పొందేందుకు అడుగులు.ఏకగ్రీవ సంస్కృతి అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి ఏక స్వామ్య వ్యవస్థకు దారి తీస్తుంది..
-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *