బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేయాలి

గౌరవనీయులయిన కేసీఆర్, కేటీర్, హరీష్ రావు గారికి…

మార్చి 2026 వరకల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ముహూర్తం డిసైడ్ చేసి మరీ బీజేపీ సర్కారు మధ్య భారతదేశంలో మారణకాండను కొనసాగిస్తున్న విషయం మీకు తెలిసిందే. మావోయిస్టు పార్టీతో సహా అక్కడి అమాయక ఆదివాసుల హత్యలు కూడా ప్రతీ రోజూ వార్తాపత్రికల్లో, మీడియాలో మీరు వింటూనే ఉండి ఉంటారు. ఆపరేషన్ కగార్ పేరుతొ గత ఏడాదిన్నర కాలంలో వందలాది భారతదేశ ముద్దుబిడ్డలను, అమాయక ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతొ బీజేపీ సర్కారు హత్య చేసింది. ఇటీవల జరిగిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో హత్య దాకా అనేక తెలంగాణ బిడ్డలు కూడా కేంద్ర బలగాల చేత హత్యగావించబడ్డారు.

మావోయిస్టు పార్టీగా పరిణామం చెందిన పీపుల్స్ వార్ 90వ దశాబ్దంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించి అనేక ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసిన సంగతి మరియు మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సూచనలు చేస్తూ, ప్రజాసంఘాల ద్వారా ఉద్యమ నిర్మాణం, పోరాటాలు చేస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో మావోయిస్టు పార్టీ చేసిన కృషి తెలంగాణ సమాజం అంతటికీ తెలిసిందే.
సమసమాజ స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రాంతంలో సామజిక-ఆర్ధిక-రాజకీయ రంగాల్లో ప్రజల స్థితిగతులను ఎంతగా మార్చివేసిందో ఎన్ని గొప్ప విజయాలు సాధించిందో మీకు తెలుసు. అదే క్రమంలో “నక్సలైట్ల అజెండాయే మా అజెండా” అని ప్రకటించారు కూడా. “పౌర హక్కుల సంఘానికి అవసరమయితే నేనే అధ్యక్షుడిగా ఉంటాను” అని మీరు అన్న మాటలు కూడా పౌరసమాజం గుర్తు పెట్టుకుంది. ఎన్ కౌంటర్ లు  లేని తెలంగాణ నిర్మిస్తామని మీరు ప్రజలకు వాగ్దానం చేశారు కూడా. 2004 శాంతి చర్చల సమయంలో జనశక్తి నేత కామ్రేడ్ రియాజ్ మరియు ఇతరులను పోలీసులు భూటకపు ఎన్కౌంటర్లలో చంపివేస్తే దానికి నిరసిస్తూ మంత్రి వర్గం నుండి కూడా మీరు బయటికి వచ్చిన సంగతి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇది శాంతి-భద్రతల సమస్య కాదు, సామాజిక సమస్యగా చూడాలని కూడా మీరు అనేకసార్లు మీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొదట్లోనే ఉటంకించినట్టుగా కేంద్రంలోని భాజపా మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మధ్యభారతదేశంలో మారణకాండను కొనసాగిస్తున్నాయి. యుద్ధనీతి తప్పి కౄరాతి కౄరంగా, అమానవీయంగా మావోయిస్టు పార్టీ సభ్యులతో పాటు అమాయక ఆదివాసీలను కూడా చంపివేస్తున్నారు. ఈ హత్యాకాండ వెనుక మధ్య భారతదేశంలోని విలువయిన ఖనిజ సంపదను బడా కార్పొరేటు కంపెనీలకు అప్పజెప్పే కుట్ర ఉన్నదన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఊసూరు బ్లాక్ కర్రెగుట్ట ప్రాంతంలో తెలంగాణ గ్రే హౌండ్స్, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ లో భాగంగా దాదాపు పది వేల మంది బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. శాంతి చర్చలకు సిద్ధం అని ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి సహా ఇతర అగ్రనాయకులు ప్రకటించడమే కాకుండా తమ బలగాలన్నిటీ “సీజ్ ఫైర్” ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ బలగాలు మారణకాండను కొనసాగిస్తున్నాయి. తెలంగాలో జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో పీస్ డైలాగ్ కమిటీ సహా దేశ వ్యాప్తంగా అనేక సామజిక కార్యకర్తలు బుద్ధిజీవులు మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండు చేస్తున్నారు.

ఈ సందర్భంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను మీరు 27వ తారీఖున నిర్వహిస్తున్నారు. ఆ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని మీరు డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటుగా మావోయిస్టు పార్టీతో వెంటనే బేషరతుగా చర్చలు జరపాలని, కర్రెగుట్టలో మోహరించిన తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్ చేయడంతో పాటు దండకారణ్యంలో మోహరించిన ప్రభుత్వ బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని సభాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేయాలని విజ్ఞప్తి. మీరు మాట్లాడే ఈ మాటలు దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ నాయకులకు స్ఫూర్తినివ్వడమే కాకుండా బీజేపీ సర్కారు పైన తీవ్రమయిన ఒత్తిడి తీసుకురాగలుగుతారు. బీఆర్ఎస్ పార్టీలోని ప్రధాన నాయకత్వం, క్యాడర్ దాదాపుగా విప్లవ పార్టీల సానుభూతిపరులే కావడం, తెలంగాణ సమాజానికి అన్నలంటే ప్రేమ ఉండడం వలన మీరు మాట్లాడే ఈ మాటలు వారిలో మీ పైన గౌరవాన్ని మరింతగా పెంచుతాయి.

కేంద్ర ప్రభుత్వ మారణకాండ పైన, శాంతి చర్చల పైన మీరు రజతోత్సవ సభలో మాట్లాడుతారని ఆశిస్తూ…

image.png
ఇప్ప పృథ్వి రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *