మహిళలకు బాధ్యతల అప్పగింతలో ముందుంటాం

– స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: మహిళల ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతలను అప్పగించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతను ప్రోత్సహించడానికి జేఎన్టీయూలో స్టాండ్ విత్ హర్ పేరుతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రోచర్‌ను ఆవిష్కరించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మన బాధ్యత తీరిపోలేదన్నారు. మహిళను మనం శక్తితో పోలుస్తాం.. అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్టానికీ గౌరవం కాదని అన్నారు. ఇంతకుముందు మహిళల వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవని, కానీ సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనూ మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని, అందుకే మనల్ని మనం సవరించుకుని బాధ్యతతో మెలగాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. సమాజంలో చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడమే కాదు.. మనమంతా సామాజిక బాధ్యతగా భావిస్తేనే మహిళల రక్షణ సాధ్యమవుతుందన్నారు. మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో సమాజంలో ఆడబిడ్డలను అలాగే గౌరవించాలి అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతో అందిస్తున్నామని, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి శిల్పారామం వద్ద దుకాణ సముదాయాన్ని కేటాయించామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించి మహిళలు అదానీ, అంబానీలతో పోటీపడేలా చర్యలు చేపట్టామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యంతోపాటు వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించి వారు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి మహిళా శక్తి స్ఫూర్తిని చాటామన్నారు. మహిళా శక్తిపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని, దేశంలోనే మహిళలకు అంత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని స్టాండ్ విత్ హర్ కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. మహిళా రక్షణకు ప్రతీ యువకుడు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలన్నారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా కాÅ£ అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. సోషల్ మీడియా పెరగడంతో సైబర్ క్రైమ్ పెరిగిపోయినందంటూ మీరు, మనం అంతా సమస్య వచ్చినపుడు స్టాండ్ విత్ హర్ అని గట్టిగా నిలబడాలని, మహిళల రక్షణ కోసం నిలబడి ప్రశ్నించేతత్వాన్ని అందరూ పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మహిళా భద్రతా విభాగం చొరవ వేధింపులకు వ్యతిరేకంగా పురుషులు నిష్క్రియాత్మక ప్రేక్షకుల నుండి చురుకైన మిత్రులుగా మారాలని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, నటుడు సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *