- అక్టోబర్ 15 – డా. అబ్దుల్ కలాం జయంతి.
- అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా
ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యలో ఉంది. భారతదేశాన్ని 21వ శతాబ్దపు విజ్ఞాన శక్తిగా మారుస్తానని కలలు కన్న మహానుభావుడు డాక్టర్ అబ్దుల్ కలాం. డాక్టర్ ఏ. పి. జె. అబ్దుల్ కలాం – ఒక ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త మరియు రాష్ట్రపతి, ఇస్రో, డిఆర్డిఓ సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. భారతదేశానికి స్వదేశీ మిసైళ్ళ తయారీ లో మార్గదర్శకుడు కావడంతో “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా” అని పిలిచేవారు. 2002 నుండి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన ప్రజలతో మమేకమై పని చేసినందున “పీపుల్స్ ప్రెసిడెంట్” అనే పేరు పొందారు. భారతరత్న (1997) – భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు.
భారతదేశ 11వ రాష్ట్రపతి, ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త మాత్రమే కాదు అంకితభావంతో కూడిన విద్యావేత్త డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం. ఈ సందర్భంలో, ఒక ముఖ్యమైన అంశంపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిగ్రీ పట్టాలు సరే… ప్రతిభ, నైపుణ్యాలు ఏవి? బీఏ, బీఎస్సీ, బీటెక్, ఎంసీఏ… ఇవన్నీ విద్యార్హతల గుర్తింపులు మాత్రమే. వాటిని సంపాదించడం ఒక గొప్ప విషయం. కానీ సమాజంలో ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఆ పనిని చేయగల నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు డిగ్రీని కాదు, పనితీరును చూస్తాయి. ఈ సందర్భంగా మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి డిగ్రీ పట్టాలు జీవితంలో విజయం కోసం ఒక మెట్టు మాత్రమే. కానీ నిజమైన ఎదుగుదల కోసం ప్రతిభ, నైపుణ్యాలు అవసరం.
డిగ్రీ అంటే ఏమిటి? డిగ్రీ ఒక విద్యార్థి విద్యా ప్రయాణానికి గుర్తింపు. కానీ ఉద్యోగాలు, పరిశ్రమలు, సమాజం కోరుకునేది అభ్యాసంలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా వాటిని ఆచరణలో పెట్టే సామర్థ్యం. అంటే, ప్రతిభ, నైపుణ్యాలు. ప్రాక్టికల్ నాలెడ్జ్. విద్యా ప్రమాణం కన్నా, పనితీరు ముఖ్యం.ప్రతిభ అంటే ఏమిటి? ప్రతిభ అంటే పుస్తకాల్లో చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు. ప్రతిభ అంటే ఆలోచించగలగటం, సృజనాత్మకంగా వ్యవహరించడం, కొత్త దారులు వెతకడం, నేర్చుకున్నది జీవితంలో ఉపయోగించగలగడం. ఇటీవల విడుదలైన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం మన పట్టభద్రుల్లో 51 శాతం మంది మాత్రమే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉన్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 8.25% మంది మాత్రమే చదువుకున్న విషయాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు, మిగతా వారంతా విద్యార్హతలతో సంబంధం లేని పనుల్లో స్థిరపడుతున్నారు. కంఫర్ట్ జోన్ చూసుకుంటూ కడుపులోని చల్ల కదలకుండా ఉద్యోగాలని నెట్టుకొద్దామని వారికి ఈనాటి పోటీ ప్రపంచంలో నిలబడలేరు. టెక్నాలజీ వేగంగా మారుతోంది.
విద్యార్థులు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా నూతన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే. లేనట్లయితే ఉద్యోగ మార్కెట్లో వెనుకబడిపోవడం ఖాయం. నిన్నటి నైపుణ్యాలతో రేపటి మార్కెట్లో ఉద్యోగాలు సాధించాలనుకుంటే కష్టమే, రేపటికి అవసరమయ్యే నైపుణ్యాలను నేటి విద్యార్జనలో భాగం చేసుకోవాలని ఎన్ ఐ టి రూర్కెలా డైరెక్టర్ ఆచార్యులు కె. ఉమామహేశ్వరరావు చెప్పిన మాటలు అక్షరసత్యం. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. వృత్తి అవసరాలకు తగిన నైపుణ్యాల లేమి. కొందరు యువకులు కేవలం డిగ్రీ పట్టాలు పొంది జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వీరిలో మార్కెట్‌లో నైపుణ్యాల లేకపోవడం వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగ అవకాశాల పరిమితి: దేశంలో పౌరాభివృద్ధి, పరిశ్రమల వృద్ధి పరిమితంగా ఉండటంతో ఉద్యోగాలు సరిపోకపోవడం.
అనుకూలమైన శిక్షణా కార్యక్రమాల లేమి: యువతకు కావలసిన నైపుణ్యాలు నేర్పించే కార్యాచరణలు తక్కువగా ఉంటాయి. విజయానికి అవసరమైన నైపుణ్యాలు ఏమిటంటే అవి సాంకేతిక నైపుణ్యాలు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్, డిజైన్, మృదు నైపుణ్యాలు : కమ్యూనికేషన్ (మాట్లాడటం, వినటం) సమయపాలన, టీమ్ వర్క్, లీడర్షిప్ స్కిల్స్, సృజనాత్మకత, సమస్య పరిష్కరణ: కొత్త ఆలోచనలు, సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతకగలగటం. అనువర్తనశీలత : మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేర్చుకోవటం. ఆత్మవిశ్వాసం- స్వీయ నియంత్రణ: శ్రమ, క్రమశిక్షణతో ముందుకెళ్లే ధైర్యం. అభ్యసనం సృజనాత్మతకు…సృజనాత్మకత ఆలోచకు…ఆలోచన మిమ్మల్ని ఉత్తమ స్థాయిలో నిలిపేందుకు దోహదం చేస్తాయని డా.అబ్డుల్ కలాం చెప్పారు. అంతేకాదు విద్య అంటే మార్కులు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని విలువైనవాడిగా మార్చే మార్గంమన్నారు.
ఫ్యాషన్తో చదివినప్పుడే ఏ కోర్స్ అయినా వంట పడుతుంది. మన కాళ్ళపై మనం నిలబడడానికి అది తోడ్పడుతుంది, ప్యాకేజీ పైనే దృష్టి పెట్టి కోర్సులో చేరేవారు మనస్ఫూర్తిగా చదవలేరు, మనసుపెట్టి ఉద్యోగాలు చేయలేరు. ఈ రోజుల్లో అన్నింటి కీ డబ్బే మూలమైపోయింది. ఫలితంగా చదువు కెరియర్ లో కూడా ఆసక్తి ఉన్న రంగాలను వదిలేసి డబ్బు బాగా వస్తుందనుకున్న రంగాల్ని ఎంచుకుంటున్నారు. అకాడమిక్ చదువులతో సంబంధం లేకుండా నిపుణత సృజనాత్మకతలపై దృష్టి పెట్టే వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళ్లడమే కాదు అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. నైపుణ్యమున్న వ్యక్తులు అనతి కాలంలోనే ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్రను వేయగలుగుతారు. ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నేటి యువత అబ్దుల్ కలాం స్ఫూర్తిని, అతని రచనల ప్రేరణ పొంది “నేను పొందిన డిగ్రీ నా ప్రతిభకు నిదర్శనమా?” “నేను సమాజానికి ఏమైనా ఇవ్వగలనా?” “నాకున్న నైపుణ్యాలు నన్ను జీవితంలో విజయవంతుడిని చేస్తాయా?” అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కలాం మార్గదర్శనమే మనకున్న గొప్ప ఆస్తి. ఆయన బాటలో నడిచే ప్రతి విద్యార్థి, పటిష్టమైన వ్యక్తిగా ఎదగడం ఖాయం. నేడు మన భారతదేశానికి కావాల్సింది ప్రతిభ, నైపుణ్యాలతో, సృజనాత్మకత, చురుకుదనం కనబరిచే యువతరం. కలాం మార్గంలో పయనిస్తే ఇటువంటి నవతరం కచ్చితంగా తయారవుతుంది.

లైబ్రేరియన్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ,వరంగల్
9849375829





