– తుదిమెరుగుల్లో జాబితా
( మండువ రవీందర్‌రావు )
చాలాకాలంగా ఊరిస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు(డిసీసీ)ల నియామకాలు ఈ నెలాఖరులోగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియామకాలకోసం గత కొద్ది రోజులుగా కసరత్తు కొనసాగుతున్నది. ఇందుకోసం ఏఐసీసీ పరిశీలకులు ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి, స్థానిక కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. వారు సేకరించిన అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలకు చేరవేశారు. దానిపై శనివారం అధిష్టానంతో రాష్ట్ర నేతలు చర్చలు జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేశ్వర్‌కుమార్ గౌడ్‌లతో పాటు పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్‌లు ఆర్గనైజింగ్ కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశమై డిసీసీ అభ్యర్థుల జాబితా, పార్టీ పటిష్టతపై చర్చలు జరిపారు. ఈ జాబితా దాదాపు ఫైనల్ అయినట్లేనని భావిస్తున్నారు. ఏఐసీసీ కూడా ఈ జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనుకుంటున్నారు.
కాంగ్రెస్‌పార్టీలో సంస్థాగతంగా భారీస్థాయి మార్పులు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పూర్వం డిసీసీల నియాకాలకు భిన్నమైన ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో డిసీసీల నియామకాలు కాంగ్రెస్ పెద్దల సిఫారసులను పరిగణలోకి తీసుకుని జరిగేవి. ఇప్పుడు దానికి భిన్నంగా స్థానిక నాయకుల అభిప్రాయాలమేరకే ఎంపికను జరుపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. వాస్తవంగా గతంలోకన్నా డిసీసీ పదవిని బలోపేతం చేసేప్రయత్నంలో ఇదొక భాగం. పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ఈ ప్రతిపాధన చేసినట్లు తెలుస్తున్నది. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నిక)కు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది కూడా ఆమె సూచించినట్లు తెలుస్తున్నది. లోకసభ అభ్యర్థుల టికట్ కేటాయింపుకు ఏఐసీసీ అద్వర్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తరహాలో రాష్ట్రస్థాయి టికట్ల కేటాయింపుకోసం వేసే కమిటీలో డిసీసీలు పాల్గొనే అవకాశం ఉంటుంది. డిసీసీలకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారుకనుకనే ఆచీతూచి ఎంపిక జరుపాలని పార్టీ నిర్ణయించింది. త్వరలో స్థానిక ఎన్నికలు కూడా రానున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతీ జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. అలాగే సామాజిక సమీకరణాల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు గత కొద్ది రోజులుగా పార్టీ కసరత్తు చేస్తున్నది. కెసి వేణుగోపాల్‌కూడా జిల్లాల అబ్జర్వర్లతో ముఖాముఖి మాట్లాడటంద్వారా ఎవరు సమర్థులన్న విషయాన్ని బేరీజు వేసుకుంటున్నారు. డిసీసీలతోపాటు పట్టణ అధ్యక్షుల నియామకాలపైన కూడా దృష్టిపెట్టారు. బహుషా ఈ నెలాఖరున రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల డీసీసీల జాబితా ప్రకటన వెలువడే అవకాశముంది. ఆ రాష్ట్రాలతోపాటు తెలంగాణ జాబితాకూడా ప్రకటించే అవకాశముందనుకుంటున్నారు. మొత్తం 35 డిసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశాన్ని దృష్టిలో పెట్టుకునే డిసీసీల ఎంపిక ప్రక్రియ జరుగుతుందనుకుంటున్నారు.
ఇదిలాఉంటే డిసీసీలుగా నలుగురు ఎంఎల్‌ఏలకు అవకాశం కలిపిస్తున్నట్లు టిపిసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తాజాగా ప్రకటించారు. ఒకరికి ఒకే పోస్టు అన్న కాంగ్రెస్ విధానానికి ఇది విరుద్దంకాదంటారాయన. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల కుటుంబాలకు రెండు పోస్టులు ఇచ్చే ఉద్దేశ్యంగానే ఆయన ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తున్నది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి డిసీసీ పదవికోసం దరఖాస్తు చేసుకుందని, ఇప్పటికే ఆమె పార్టీలో కొనసాగుతున్న వ్యక్తిగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొన్ని జిల్లాల్లో అక్కడి పరిస్థితిని బట్టి ఎంఎల్‌ఏలకే అద్యక్షపదవి ఇవ్వడం సమంజసంగా ఉంటుందని పార్టీ వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


