ధ్రువ మాస్పిటల్‌లో క్షతగాత్రులకు పరామర్శ
హైదరాబాద్, ప్రజాంత్ర, జూలై 1: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రితోపాటు మంత్రి దామోదర మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను దామోదర స్వయంగా నమోదు చేసుకున్నారు. అందరి ఫోన్ నంబర్లు తీసుకుని ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తన ఫోన్ నంబర్‌ను బాధిత కుటుంబ సభ్యులకు రాసిచ్చి ఏ ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలని దామోదర సూచించారు. వైద్య చికిత్సలు పూర్తయ్యే వరకు బాధిత కుటుంబ సభ్యులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ తదితరులు కూడా వారి వెంట ఉన్నారు.





