డా. కల్లూరి ఆనందరావు గారి లేఖిని నుంచి వెలువడిన “ఆలోకనమ్” సాహితీ వ్యాసావళిలో మొత్తం 24 వ్యాసాలు ఉన్నాయి. ఇందులో అర్థభాగం ఇనాక్ గారి సాహిత్యం వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఇనాక్ సాహిత్య పరిశోధకులకు దళిత సాహిత్య అధ్యయన పరిశోధకులకి ఈ పుస్తకం ఉపకరిస్తుంది, ఈ పుస్తకంలో సగభాగం దళిత సాహిత్యానికి సంబంధించిన అనేక ప్రామాణిక విషయాలు చర్చించబడ్డాయి, 1909 సంవత్సరం ఆంధ్రభారతి మాసపత్రికలో ఒక అజ్ఞాతకవి వ్రాసిన “మాలవాండ్రపాట”ను ఆధునిక తెలుగు సాహిత్యంలో దళితులబాధల గురించి సమాజానికి చాటిన తొలిరచనగా డా: కల్లూరి ప్రమాణీకరించారు, అనంతరకాలంలో తెలుగుసాహిత్యంలో వెలుగు చూసిన అనేకమంది దళితవాదులు బీర్నుడి మోషే మొదలు కత్తి పద్మారావు వరకుగల దళితకవులు దళితవాదుల రచనలను మనసుతో చదివిన అనుభవంతో విలువైన వ్యాసాలు విశ్లేషణాత్మకంగా రాశారు.
చార్య ఇనాక్ అంటేనే అభ్యుదయ కవిత్వానికి చిరునామాదారుడే కాదు దళితజీవుల పాలిట భరోసా బావుటా! వారి కవిత్వంలో ప్రత్యేకంగా దళిత మహిళా అభ్యుదయం గురించి చెప్పడంలో అర్థం గమనిస్తే ఇనాక్ కి మహిళలపట్ల గల మాతృభక్తి తెలుస్తుంది, ఆయన దృష్టిలో అమ్మకు భార్యకు అభేదం, జన్మనిచ్చిన తల్లి జన్మ తరించడానికి వెంటనడిచిన భార్య, ఇద్దరు ఆయన దృష్టిలో మాతృమూర్తులే! మానవజాతి దాస్య విముక్తి అందున స్త్రీలు దళితులు సర్వతో ముఖాభివృద్ధి చెందడమే అంతిమలక్ష్యంగా ఇనాక్ కవిత్వం సాగుతుంది, స్త్రీని సమాజంలో అత్యున్నతస్థితిలో నిలపాలన్నదే ఆయన సాహితీకృషి పరమార్థం, అందుకే ఆయన రాసిన కవిత్వం, కథ, నవల, నాటకం, ప్రతిదానిలో స్త్రీని ఉన్నతస్థితిలో ఉంచారు.
ఇనాక్ ను కవిగా మాత్రమే ఆవిష్కరించి ఆగిపోకుండా ఆయనలోని మరో సృజనకోణం కథారచయితను కూడా పాఠకులకు పరిచయం చేస్తూ వారు రాసిన కథ “అస్పృశ్య గంగ”ను విశ్లేషణ చేస్తూ సామాజిక దృక్పథం గురించిన వివరాలు చెబుతూ ఇనాక్ రాసిన ఇతర కథల్లోని వస్తువైవిధ్యాన్ని కళ్లకు కట్టారు డా: కల్లూరి. “అస్పృశ్యగంగ” కథగల 19 కథల తెలుగు కథాసంపుటి అనంతరం కన్నడం, హిందీ, ఆంగ్లం, భాషలోకి అనువదించబడిన విషయం గుర్తు చేస్తూ- జలాన్ని భూమాత స్తన్యంగా అభివర్ణించి అమ్మ పాలమీద బిడ్డలందరికీ హక్కు ఉన్నట్టే భూమినుంచి వచ్చిన నీటికి భూమిమీద పుట్టిన అందరికీ అనుభవించే హక్కు ఉందని చెబుతూ నీరు అంటేనే మాలిన్యాన్ని శుద్ధి చేసేది అలాంటప్పుడు నీటికి మాలిన్యం ఎందుకు ఆపాదించాలి? అని ప్రశ్నిస్తూ స్పృశ్య, అస్పృశ్యం, అనేవి వ్యక్తుల సంస్కారాన్ని బట్టి వస్తుంది కానీ కులాన్ని బట్టి కాదని “అస్పృశ్యగంగ” కథ ద్వారా హెచ్చరిస్తారు ఇనాక్.
కరుడుగట్టిన కులవ్యవస్థ అనే బండను పగలగొట్టాలి అంటే అది ఒక్క శ్రమవీరులకే సాధ్యం అంటూ శ్రమశక్తిపై గల తన మమకారాన్ని చెబుతూ శ్రమజీవిని అసలైన అందగాడుగా చమట పట్టిన శరీరమే శ్రేష్టమైనది, చమటజీవే లావణ్యవంతుడు అనడంలో ఇనాక్ శ్రమైక సౌందర్యదృష్టి అర్థమవుతుంది, శ్రమజీవికే పట్టం కట్టాలి అనడంలోని ఆయన సరళమైన సామాజిక దృక్పథం స్పష్టమవుతుంది, సామాజికంగా భారతీయ సమాజం దేవుడు, మతం, కులం, పేరుతో ఎంతగా చీలికలైపోయిందో “అస్పృశ్యగంగ” కథలో ఇనాక్ కళ్ళకుకట్టిన తీరును ఇందులో రచయిత డా: కల్లూరి గుర్తు చేశారు. ఇనాక్ కథల్లోని అంతఃసూత్రం ఒక్కటే అది “పీడిత జనాభ్యుదయం దానివైశిష్ట్యం వేదన నుంచి వెలుగు” అంటూ ఏకవాక్య సమాధానం ఇస్తూనే కథకు కేంద్రబిందువు వస్తువు కావచ్చు కానీ అది రచయిత సామర్థ్యంతో ఇతివృత్తమై చదువరుల జీవితాల్లోని సంఘటనలతో ముడిబడి విషయం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది, అంటూ కథావస్తువు యొక్క ప్రత్యేకతలను రచయిత విశ్లేషించిన వైనం బాగుంది.
అంబేద్కర్ వాదానికి సంబంధించిన మూడువ్యాసాల ద్వారా అంబేద్కర్ మానవతావాదాన్ని ఆవిష్కరించారు.
బోయ భీమన్న కలం సృష్టి అయిన “అంబేద్కర్ సుప్రభాతం” స్తోత్రకావ్యం గురించి వివరిస్తూ భీమన్న అంబేద్కర్ భావజాలాన్ని తనదైన ఆలోచన విధానం సర్దిచెప్పే ప్రయత్నం జరిగిందంటూనే దళితసమస్యల పట్ల హిందూమతం పట్ల గాంధీకి అంబేద్కర్ కు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడాఉంది అంటూ వర్ణవ్యవస్థను అంగీకరిస్తూనే కులవ్యవస్థను నిర్మూలించాలని ప్రయత్నించిన గాంధీ, హిందూమత వ్యవస్థని మార్చాలన్న అంబేద్కర్ కు పొత్తుకుదరక జరిగినచర్చలు వివాదాలైనాయి, కాని అంబేద్కర్ సుప్రభాతంలో గాంధీతత్వానికి అంబేద్కరిజానికి భిన్నత్వంలేదని నిరూపించిన విషయం ఇందులో మన గమనించాలి ఇదే ఆనంద్ గారి విలక్షణ విమర్శనాతత్వం, అంబేద్కర్లోని సాంఘికాభ్యుదయం గురించిన విశ్లేషణలో భారతీయ ఆకాశంలో బహుముఖ సూర్యుడిగా అతడిని అభివర్ణిస్తూ సమీకరించు, బోధించు, ఉద్యమించు, అన్న అంబేద్కర్ త్రిణాత్మక ప్రబోధాలు నేటి తరం విద్యార్థులకు అత్యవసరం అని నిరూపిస్తారు రచయిత డాక్టర్ కల్లూరి, అంబేద్కర్ అభ్యుదయవాదం ఆధునికాంధ్ర కవిత్వం గురించిన విశ్లేషణలో అక్షరానికి నిలువెత్తు రూపంగా అంబేద్కర్ని అభివర్ణించారు ఆయన కేవలం దళితజాతి అభ్యున్నతికే కాదని దేశ అభ్యుదయం కోసం మహత్తర బాధ్యతను వెనకేసుకున్నారు అని అభివర్ణించారు ఆనంద్.
“నేనెరిగిన గురువు ఆచార్య ఇనాక్” అంటూ తన సిద్ధాంత గ్రంథం “హరిజనాభ్యుదయం ఆధునికాంధ్ర కవిత్వం”లో తను ప్రతిపాదించిన దళిత కవిత్రయంలో గుర్రం జాషువా, బోయి భీమన్నల సరసన కొలకలూరి ఇనాక్ ను చేర్చారు. అనేక సాహితీ విషయాలు విశేషాలు ప్రామాణీకరణలుతో పాటు ఎన్నో స్వీయ అనుభవాల అనుభూతుల సమ్మేళనంగా సమీకరించబడ్డ వ్యాసదీపిక, బహుళ ప్రయోజనాల పేటిక, సాహితీ పరిశోధక విద్యార్థుల పాలిట మార్గదర్శి. ‘ఆలోకనమ్’ సాహిత్య విమర్శ.





