తుఫాను న‌ష్టం అంచ‌నాకు ప్ర‌భుత్వం చర్యలు

– ధాన్యం, ప‌త్తి కొనుగోళ్ల‌లో రైతుల‌కు అండ‌
– రెండు మూడు రోజులు పంట కోతలు వాయిదా వేయాలి
– రైతుల‌కు ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి
– స‌హాయ‌క చ‌ర్య‌ల్లో అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యం
– విద్యుత్ స‌రఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29:  మొంథా తుఫాను తెలంగాణ మీదుగా ప్రయాణించి బలహీనపన నేప‌థ్యంలో తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి, సహాయక చర్యలను చేపట్టడానికి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ అంచనాలు పూర్తయ్యాక రైతులకు తగిన నష్ట పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం కారణంగా కోతకు వచ్చిన వరి, మిర్చి, పత్తి పంటలకు నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ (హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్), ఖమ్మం, ములుగు జిల్లాల అధికారులను పంట నష్టాల సర్వేను త్వరగా పూర్తి చేయాలని ప్ర‌భుత్వం ఆదేశించింది. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం సందర్శించి కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మొంథా తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా రెండు నుండి మూడు రోజులపాటు రైతులు పంట కోతలు నిలిపివేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. కాగా, వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పీఆర్‌ శాఖలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సురక్షిత తాగునీటిని అందించడంపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. భూపాలపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన నీటిని మోటార్ల ద్వారా తోడేసి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్లను, స్తంభాలను మరమ్మతులు చేసి, కరెంటు సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *