కౌలు రైతు ‘భరోసా’పై కాంగ్రెస్‌ స్వరం మారిందా ..?

కౌలు రైతుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన పదినెలల్లోనే తన మాటను మార్చుకున్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిల్లీ లో  మీడియా ముందు చేసిన ప్రకటన అదే విషయాన్ని చెబుతున్నది. రైతు, కౌలు రైతును విడదీసి చూసే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్న విషయం దీనివల్ల అర్థమవుతున్నది. ఎన్నికముందు, ఆ తర్వాత అంటే నిన్నమొన్నటి వరకు కూడా భూమి గల రైతుతోపాటు కౌలురైతుకు కూడా రైతుభరోసా ఇస్తామని ఘంటాపథంగా కాంగ్రెస్‌ చెబుతూవొచ్చింది. రుణమాఫీతోపాటు కౌలురైతును ‘భరోసా’లో భాగస్వామిని చేస్తామని ఇచ్చిన హామీలవల్లనే కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిందన్నది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పదేపదే వల్లించిన విషయం తెలియందికాదు. రైతు బంధుపేరున బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్నదానికన్నా ఎక్కువగా అంటే ఎకరానికి 15 వేల రూపాయలను పంట పెట్టుబడిగా అందిస్తామంది కాంగ్రెస్‌. అంతేకాదు కౌలురైతు లతోపాటు పోడు రైతులకు  కూడా ఆర్థిక సహాయం అందిస్తామంది.

ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వమన్నదేమీలేదన్న విషయాన్ని స్వయంగా రాష్ట్రముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన విషయం కూడా తెలిసిందే. కౌలురైతుకు అన్యాయం జరుగుతున్నదని  బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆందోళనచేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం, ఎన్నికల హామీల్లో ఈ విషయాన్ని పొందుపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 25 లక్షల మంది కౌలురైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాని, తాజాగా తుమ్మల ప్రకటన వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతకు ముందున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పైన కౌలురైతుల విషయంలో తీవ్ర విమర్శ చేసిన కాంగ్రెస్‌కు ఇప్పుడు కౌలురైతులను గుర్తించడం  పెద్ద తలనొప్పి తయారైంది. గ్రామసభల్లోనే కౌలురైతులను నిర్ధారించి వారికి చట్టపర రక్షణ కల్పిస్తామని, కౌలుదారు, రైతు చేసుకునే ఒప్పంద పత్రం గ్రామసభ ఆమోదించాల్సి ఉంటుందంటూ పలు ఆలోచనలు చేసిన  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకనో మాటమార్చింది.

ఇప్పుడు భూయజమాని, కౌలురైతు కలిసి రైతు భరోసా ఎవరు తీసుకోవాలన్న విషయాన్ని తేల్చుకోవాలనడం ఇప్పటివరకు సామరస్యంగా కొనసాగుతూ వొస్తున్న వారి బంధానికి విఘాతం కలిగించే చర్యగా అభిప్రాయపడుతున్నారు రైతు నేస్తాలు. ఈ విషయాన్ని ముందస్తుగా గ్రహించే కెసిఆర్‌ నాయకత్వంలోని గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎట్టిపరిస్థితిలో కౌలురైతును సాగురైతుగా గుర్తించమని స్పష్టం చేశారు. బాధ్యతగల ముఖ్యమంత్రిగా రైతుకు మేము సహాయం అందిస్తాం. దానిపైన మానవీయ కోణంలో రైతు ఆలోచించి తన కౌలు రైతుకు సహాయం చేసుకోవాల్సి ఉంటుందని ఆనాడే చెప్పారు.

అది వాళ్ళిద్దరిమధ్య జరుగాల్సిన విషయన్నారు. కాని, దాన్ని ఆనాడు వ్యతిరేకించిన ప్రతిపక్షాల్లోని కాంగ్రెస్‌ ఆఖరికి  అదే విషయాన్ని నేడు తేల్చిచెప్పింది. అయితే వాస్తవంగా వ్యవసాయం చేసేవారికే రైతు భరోసా అందించాలన్నది కాంగ్రెస్‌ ఉద్దేశ్యం. పంట ఎవరు పండిస్తే వారికే రైతు భరోసా అంటోంది. ఏదిఏమైన తుమ్మల ప్రకటన తెలంగాణ రైతాంగంలో ముఖ్యంగా కౌలురైతులను పెద్ద నిరాశలో పడేసింది. జూలైలో అందాల్సిన ఈ సహాయం ఆర్థిక వెసులుబాటుకాక కొంత, కౌలురైతు గుర్తుంపుపై జరుగుతున్న మీమాంసకారణంగా ఇవ్వాల్టికి రైతులకు చేరలేదు. దసరా నాటి కైన ఈ విషయంలో స్పష్టత వొస్తే రైతు పెట్టుబడికి భరోసా వొచ్చే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *