బనకచర్లపై  ప్రతిఘటించింది కాంగ్రెస్‌ సర్కారే

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బనకచర్ల-గోదావరి ప్రాజెక్టును గట్టిగా ప్రతి ఘటించింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిధుల కోసం రాసిన లేఖపై తాను జనవరి 22న రాసిన లేఖను ఆయన ఉటంకించారు. అధికారికంగా ఉన్న అభ్యంతరాలను లేవనెత్తుతూనే జూన్‌ 13నాటి పిఎఫ్‌ఆర్‌లను తిరస్కరించడంతోపాటు డి.పి.ఆర్‌ ప్రతిపాదనలను నివారించి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సన్నద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. తెలంగాణ నీటి హక్కుల అంశంలో నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉదాశీనతతో ఉండడం వల్ల నీటి కేటాయింపులలో మన హక్కులకు భంగం వాటిల్లిందన్నారు. వాస్తవానికి కృష్ణా జలాశయాలలో తెలంగాణ వాటా 724 ఉండగా 290 టిఎంసీలకు కుదించి 512 టిఎంసిల నీటిని ఆంద్రప్రదేశ్‌కు అప్పగించిన ఘనత బిఆర్‌ఎస్‌ పాలకులదన్నారు. అదే ఈ రోజు రాష్ట్రంలో నీటి సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారిందని ఆయన విరుచుకుపడ్డారు. మచ్చుమర్రి, మాల్యల ప్రాజెక్టులకు అక్రమంగా నీటిని తరలిస్తుంటే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పధకం టెండర్ల ప్రక్రియ సాగుతుంటే నాటి ప్రభుత్వం ఎపెక్స్‌ కౌన్సిల్‌ను ఎందుకు ఆశ్రయించ లేదని నిలదీశారు. నాటి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మోహన్‌ రెడ్డిల నిర్వాకమే ఇందుకు కారణమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *