చావులకు రేవంత్‌రెడ్డి బాధ్యుడు : కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 13 : మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతల భయంతో ఆటో డ్రైవర్ రవీందర్ హఠాన్మరణం చెందిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చావుకు కారణం నువ్వు.. నీ హైడ్రా బుల్డోజర్లు కారణం కాదా అని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. హైడ్రాతో పేదల్లో భయం నింపింది.. పేదల గూడులను కూల్చమన్నది నువ్వు కాదా అని నిలదీశారు. డీపీఆర్ లేదంటూనే ఇళ్ల మీద మార్కింగ్‌లు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది నువ్వు కాదా అని సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. బుచ్చమ్మ అకాల మరణానికి బాధ్యుడివి నువ్వే.. రవీందర్ గుండెను ఆపింది నీ హైడ్రా బుల్డోజర్లే అని మండిపడ్డారు. అమాయకులను బలితీసుకుని.. వారి బతుకులను ఛిద్రం చేసి, వాళ్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసి, వారి గుండెలను ఆపేసిందన్నారు.
తన ఇంటిని కూల్చివేస్తారని దిగులు చెందిన ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన రామంతాపూర్‌లో చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. రామంతాపూర్ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన రవీందర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూసీ కూల్చివేతల్లో భాగంగా తమ ఇంటిని కోల్పోతామని కొద్దిరోజులుగా దిగాలుగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రోజూ మాదిరిగానే గురువారం నాగోల్ నుంచి ఇంటికి వస్తుండగా గుండెపోటు రావడంతో రవీందర్ మృతిచెందాడు. తన ఇంటిని కూల్చివేస్తారనే ఆవేదనతోనే మరణించినట్టు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుండెపోటుతో రవీందర్ మృతి చెందిన విషయం సోషల్ మీడియాతోపాటు స్థానిక గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.