నాపై ఫిర్యాదా.. ఛాన్సే లేదు

– ఆ ఫిర్యాదులను నమ్మడంలేదు
– రూ.251 కోట్లతో సమ్మక్క`సారలమ్మ ఆలయాభివృద్ది
– ఈసారి కోటిమందికిపైగా భక్తులు వస్తారని అంచనా
– వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి

మేడారం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: అశేష భక్తుల కొంగుబంగారం సమ్మక్క సారలమ్మ ఆలయాభివృద్దికి ప్రభుత్వం రూ.251 కోట్ల ఖర్చు చేయనున్నట్లు వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ది పనులను సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ‘నేనేంటో అందరికీ తెలుసు.. రూ.70 కోట్ల కాంట్రాక్టు పనికి తాపత్రయపడే అవసరం నాకు లేదు.. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు.. అధిష్టానానికి ఎవరూ ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు.. నేను కూడా అలా జరుగుతుందని నమ్మడం లేదు.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల మేరకు అభివృద్ది పనులు చేస్తున్నాం.. సమ్మక్క సారలమ్మల వంటి సీతక్క, సురేఖ అక్కలతో ఈ కార్యక్రమాలకు హాజరవుతాను’ అని చెప్పారు. ఆలయ పనుల ప్రగతిని అధికారులతో సమీక్షించి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా రూ.101 కోట్లు మంజూరు చేయగా వీటిలో రూ.71 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు. గతంలో మంజూరైన రూ.150 కోట్లతో కలిపి దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఆలయాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామన్నారు. మహా జాతరకు మంజూరైన నిధులు జంపన్న వాగు వరదలాగా జారిపోకుండా గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్యదైవాల ప్రాంగణాలను అభివృద్ది చేస్తామని, దీనిలో భాగంగా రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఒక క్రమపద్దతిలో పనులు సాగేలా కలెక్టర్‌, ఎస్పీలకు సూచనలు ఇచ్చామన్నారు. ఆలయాభివృద్దికి ఎవరు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని, ఈ పనులను మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పారు. గతంలో ఈ జాతరకు కోటిమందికిపైగా వచ్చినట్లు అధికారులు చెప్పారని, ఈసారి ప్రభుత్వ అభివృద్ది చర్యల కారణంగా ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని మంత్రి చెప్పారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *