ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం

  • మ‌హిళాభ్యుదాయానికి కృషి
  • రైతు సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం 
  • యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు 
  • విద్య‌, వైద్య రంగాల‌ను ప్ర‌క్షాళ‌న 
  • కుల‌గ‌ణ‌న విజ‌య‌వంతం 
  • బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు
  • తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి ప‌దేళ్ళు దాటినా నెర‌వేర‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సోమ‌వారం ప‌రేడ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ (Telangana Formation day) ల్లో పాల్గొని ఆయ‌న ప్ర‌సంగించారు. తాము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత త‌మ ప్ర‌భుత్వంపై వుంద‌న్నారు.  ఇందులో భాగంగానే నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ ఆర్ సి స‌భ్యుల‌ను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామ‌న్నారు.

మ‌హిళాభ్యుద‌యానికి కృషి

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించామ‌ని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామ‌న్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టాం. మహిళా సంఘాల ద్వారా 600 బ‌స్సులు  కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశాం. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తామ‌న్నారు.

రైతు సంక్షేమం

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం ఎనిమిది నెలల్లో 2535964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నాం. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నామ‌న్నారు.  వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. దీనివల్ల రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. దీంతో 275 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్రవ్యాప్తంగా 8వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా చూస్తున్నామ‌న్నారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ యజమానులకు భరోసా కల్పిస్త్నున్నాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామ‌న్నారు.

యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు

 అధికారంలోకి వచ్చిన16నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాం. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. వైద్యరంగంలో, పోలీస్, నీటిపారుదల, సింగరేణి కాలరీస్, ఇలా వివిధ రంగాలలో ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నామ‌న్నారు.  సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామ‌న్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం.వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్న‌ట్టు తెలిపారు.

బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు

రిజర్వేషన్లు పెంచి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానం. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాలలో 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం.. బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చాం
దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నాం. శాసనసభ,శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణలోకులగణన చేపట్టేందుకు సిద్ధమైంద‌ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలవర్గీకరణపై మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఎస్సీ ఉప కులాను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించాం.ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4 ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరపాలని నిర్ణయించాం.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు

సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. నిజమైన లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నాం. ఎంపిక చేసిన కొంతమందికి తొలి దశలో లక్ష రూపాయలు చెల్లించాం. మే 20 నాటికి 5,364 ఇందిరమ్మ లబ్దిదారులకు రూ. 53.64 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమచేసామ‌న్నారు.  సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణలో మూడు కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.

పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానం

దావోస్, సింగపూర్,జపాన్ లాంటి దేశాల్లో పర్యటించిఇప్పటి వరకు3లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్.సీ.ఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ లో ఇదొక తొలి మెట్టు. ప్రపంచ దేశాల నగరాలకు ధీటుగా హైదరాబాద్ ను తీర్చదిద్దేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును చేపడుతున్నాం. బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం.

ప్ర‌పంచ స్థాయిలో ఫ్యూచ‌ర్ సిటీ

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్  అథారిటీని ఏర్పాటు చేశాం.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మామునూరు విమానావ్రయం పునరుద్ధరణకు అన్ని అనుమతులు సాధించాం. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం. రీజనల్ రైల్ తో పాటు మెట్రో రైల్ విస్తరణ చేపడుతున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూ.24వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నామ‌న్నారు.

పోలీస్ శాఖ ప‌టిష్టం 

శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖను మరింత పటిష్టపరిచాం. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపేందుకు చర్యలు తీసుకున్నాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ గా నిలిచింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి దుబాయ్ లో అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇది మనకు ఎంతో గర్వకారణం. దేశ రక్షణ, సమగ్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలుస్తున్నాం. పహల్గామ్ దాడుల ఘటనలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

ప్ర‌తిష్టాత్మ‌కంగా భార‌త్ స‌మ్మిట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో‘భారత్ సమ్మిట్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ ను అంతర్జాతీయ వేదికగా మార్చాం. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గారు అందించిన అలీన విధాన స్ఫూర్తితో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమ్మిట్ లో చర్చించాం. భారత్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాం.

మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు 

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. తెలంగాణ జరూర్ ఆనా అంటూ వందకు పైగా దేశాల నుంచి 72వ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు.

ఉద్య‌మ‌కారుల‌కు న‌గ‌దు పుర‌స్కారం 

తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని  ముఖ్యమంత్రి అంద‌జేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి ప్రకటించిన మేర‌కు ఈ పుర‌స్కారాల‌ను అంద‌జేశారు.  వీటిని అందుకున్న‌వారిలో ఎక్కా యాదగిరి రావు,అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి వున్నారు.  దివంగత గూడ అంజయ్య,గద్దర్, బండి యాదగిరి నగదు పురస్కారాన్ని అందుకున్న వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు.  విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.

ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ ,11 మంది కి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు లను ముఖ్య‌మంత్రి ప్ర‌దానం చేవారు. బహు బాషా సాహితీ వేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారాన్ని బ‌హూక‌రించారు.

విద్య‌, వైద్య‌రంగాల ప్ర‌క్షాళ‌న‌

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని మేం విశ్వసించాం. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్ ను నియమించాం. మెరుగైన విద్య వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని కమిషన్ ను ఆదేశించాం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్ లో మెస్ చార్జీల సమస్యను పరిష్కరించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా డైట్ చార్జీలను 40శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టామ‌న్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలను నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *