- అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం
- గాంధీ కుటుంబంలో నాకు మంచి అనుబంధం..
- ఫొటోలు దిగి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
- తెలంగాణలో ఏప్రిల్ లో మూడు రోజుల పాటు భారత్ సమ్మిట్
- ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి
New Delhi | ప్రజాతంత్ర, మార్చి 13 : మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన వారికి ఇచ్చిన మాటను నిబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి వొచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానని.. అవన్నీ ఇప్పుడు నెరవేరుస్తున్నట్లు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గురువారం దిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చానన్నారు. అలాగే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామని తెలిపారు.
ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు.
గాంధీ కుటుంబంతో తనకు అనుబంధం అంతకు మించి ఉందని.. ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర కేబినెట్‌లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్రం అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందని.. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
తెలంగాణలో ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు భారత్ సమ్మిట్ (Bharat Summit 2025) నిర్వహించనున్నట్లు తెలిపారు. 60 దేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నామన్నారు. దానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అనుమతి కావాలని.. అందుకే విదేశాంగ శాఖ మంత్రిని కలుస్తున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్ విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానన్నారు. దానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత డీఎంకే మీటింగ్‌లో తమ వైఖరి చెప్తామన్నారు. పన్నులు వసూలులో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోయినా, ప్రజలు ప్రాణాలు పోతున్నా బీఆర్‌ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు నివాళి
హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా, సాహితీవేత్తగా, బహు భాషా వేత్తగా బూర్గుల రామకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞ కనపర్చారని సీఎం కొనియాడారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్, భువనగిరి ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.





