- అందరికీ క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావాలి
- దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్వవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేయడానికి కసరత్తు ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్ లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ కొనియాడారు. క్యాన్సర్ మహమ్మారితో ఎంతో మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స నిరుపేదలకు ఆర్థికంగా పెనుభారంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఎవరైనా హాస్పిటల్ కి వెళితే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని,. హెల్త్ రికార్డ్స్ లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నారని, విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.





