– ఖైదీలకు బీమా.. కుటుంబ సభ్యులకు రుణాలు
– ఖైదీల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లల్లో చదువులు
– చర్లపల్లి జైలును సందర్శించిన కేంద్ర మంత్రి
– డిజి సౌమ్యా మిశ్రాను అభినదించిన మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: చర్లపల్లి జైలులో ఖైదీల సంక్షేమానికి చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖైదీలకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదవిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్‌ను అభినందించకుండా ఉండలేమన్నారు. కస్టడీ-కేర్-కరక్షన్‌కు సౌమ్య మిశ్రా నిజమైన ఆచరణ రూపమిస్తున్నారని సోమవారం చర్లపల్లి జైలును సందర్శించిన సందర్భంగా చెప్పారు. డీజీ సౌమ్య మిశ్రాతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. చర్లపల్లి జైలులో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీలను, వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి తెలుసుకున్నారు. గోశాలను సందర్శించారు. గోవులకు స్వయంగా తన మేత తినిపించారు. ఒక లేగ ఆవుకు కృష్ణ అని నామకరణం చేశారు. జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ క్లబ్, బంతి పూల వనాన్ని సందర్శించారు. తేనె టీగలతో తేనె ఏవిధంగా పడుతున్నారనే విషయాన్ని స్వయంగా తిలకించారు. అనంతరం ఖైదీల కోసం జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖలు సైతం చర్లపల్లి జైలును సందర్శించి సంస్కరణలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నందున హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మేళా నిర్వహించి ఆయా ఉత్పత్తులు ప్రజలకు అందించాలని సూచించారు. జైళ్ల శాఖకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండ్ శివకుమార్ గౌడ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్రం చర్లపల్లి జైలు అభివ్రుద్ధి కోసం ఇప్పటి వరకు రూ.11.60 కోట్లు మంజూరు చేయగా రూ.11.30 కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత విప్లవాత్మకంగా సంస్కరణలు చేపట్టారన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు వీడియో లింక్ ద్వారా తాము ఉన్న ప్రాంతాల నుండే మాట్లాడే (ములాఖత్) అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. ఖైదీలకు బీమా సౌకర్యాన్ని వర్తింపజేసినట్లు పేర్కొన్నారు. ఖైదీలు చదువుకునేందుకు విస్తృత అవకాశాలు కల్పించడంతోపాటు చదవు పూర్తయ్యాక డిగ్రీలు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల ఆరోగ్యంపైనే ప్రత్యేక ద్రుష్టి సారించామని, నిష్ణాతులైన డాక్టర్లను నియమించినట్లు పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు అగ్రగామిగా నిలుస్తున్నారని తెలిపారు. జైళ్ల శాఖ అందిస్తున్న సేవలు, చేస్తున్న అభివృద్ధికి ప్రతిష్టాత్మకమైన స్కోడా అవార్డు వచ్చినట్లు వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



