సీఎం రేవంత్‌కు కేందమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
దిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: భారత దేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కార్యక్రమాలకు రాష్ర సహకారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. కోల్ ఇండియా లిమిటెడ్, నైవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇవి వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నాయని తెలిపారు. తెలంగాణలోని అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయాల్సి ఉందని, గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ రిలయబిలిటీలను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆ లేఖలో తెలిపారు. అలాగే క్రిటికల్ బ్యాలెన్సింగ్ కెపాసిటీని అందించేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, అమలు, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, స్థానిక ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో లేదా బొగ్గు కంపెనీలు స్వతంత్ర ప్రాతిపదికన జాయింట్ వెంచర్ మోడల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ మద్దతు అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు కర్బన ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, సహజ వనరుల నిర్వహణ తదితర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వీటి ద్వారా ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంధన భద్రతతోపాటు అవసరమైన మేర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడం, సమ్మిళిత అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడం వంటి సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించనున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలుకావడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరమని, ఇందుకోసం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్రం సంపూర్ణమైన చిత్తశుద్ధితో సహకారం అందిస్తోందని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత మరింత పెరగనుందని మంత్రి డతెలిపారు. పర్యావరణ పరిరక్షణతోపాటుగా ఆత్మనిర్భరతతో కూడిన భవిష్యత్‌ను ఏర్పర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారంలో మీ చొరవ కీలకం. తెలంగాణలో రానున్న ఈ సానుకూల మార్పుకు మీ సహకారాన్ని కోరుతూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, తమ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలనుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆ లేఖలో హామీ ఇచ్చారు.





