కవి అంతరంగంలో కమ్ముకుని, అల్లుకుని, విస్తరించి, అంతర్లీనమై విచ్చుకునే సంకీర్ణ సంక్షోభ సృజన ప్రపంచం కవిత్వం. లోన నుండి పైకి లాగితే నూతన నవ్య కాంతి శక్తితో అనుభవధారగా కవిత్వం కురుస్తుంది. దీర్ఘ తపస్సమాధికి వెళ్లి గొప్ప మాంత్రిక శక్తిని కవి కవిత్వానికి ధారపోయక పోతే ఇంతటి అజరామరత్వంతో ఆ భావోద్వేగ సాంద్రత హృదయాల్లో నిక్షిప్తమయ్యేదా అన్పిస్తుంది. నిశ్చలంపైకి అకస్మాత్తుగా తెగిపడిన కల్లోలపు అనుభవం కవిని మాట్లాడించి కవిత్వాన్ని ప్రవహింపజేస్తుంది. అందుకే కవి గీసుకొనే వివర్ణవృత్తం, రాసుకునే కన్నీటి ఉత్తరం, పూయించుకునే అక్షరవనం, వెతుక్కునే జ్ఞానదిశ, తొడుక్కునే వెన్నెల కవచం ఖచ్చితంగా కవిత్వమే. స్వేచ్ఛాగీతం పాడుకునే కవి బంధీ అయ్యేది కవిత్వ చెరసాలలోనే. సమాజంలోని విభిన్న అంశాలను నిశితంగా పరిశీలించి ఉద్వేగంగా, ఉదాత్తంగా తనలోని ఆత్మవేదనను మట్టి పరిమళం పేరిట కవిత్వీకరించి సాహితీ క్షేత్రంలో పేరొందిన దార్శనిక కవి, ఆలోచనాశీలి డాక్టర్ పెద్దివెంకటయ్య. తన చుట్టూరా పరివృతమై ఉన్న సామాజిక సముద్రపు అలలపై కదిలే బతుకు పడవల ఎదలోతుల్ని కడిగి దాహవ్యధల్ని ఆవిష్కరించిన కవిగా వెంకటయ్యను ఆయన కవితా సంపుటి మట్టి పరిమళం నిలిపింది. జడత్వం నుండి జాగృతి వైపు మనిషి నడవాలని బలమైన కవితాకాంక్షను వెల్లడిస్తూ ఇప్పుడు వెంకటయ్య కవితా విశ్వవీణను మ్రోయించారు. అరుణ కిరణాలతో విశ్వంభరపైకి విచ్చేస్తాడు వెలుగు కొరడాలతో పుడమిని మేలుకొలుపుతాడు అని ప్రాచీరేఖ మీద ప్రభవించి కల్లలు, ఎల్లలు ఎరుగని తనంతో జీవకోటికి ప్రాణాధారంగా మారి వైతాళికుడైన యోగిగా, విశ్వవీణావిష్కర్తగా ఆదిత్యుడిని (సూర్యుడు) అభివర్ణించారు. ఒకనాడు ఇలపైన స్వర్గంగా నిలిచిన తన ఊరు మారిన కాలమాన పరిస్థితులలో రూపుమారిన తీరును మా ఊరు కవితలో వేదనాభరిత హృదయంతో చెప్పారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా ఒకనాడు భాసించిన ఊరు ప్రపంచీకరణ పదఘట్టనతో అస్తిత్వాన్ని కోల్పోయి నగరీకరణను అద్దుకున్న వికృత వైనాన్ని హృదయదఘ్నంగా చిత్రించారు. బురుజులు కూలిన చోట మిద్దెలు, మేడలు నింగినంటాయని, సిందోళ్ల బాగోతం, గొల్లసుద్దులు, కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, దొరగడీలు, శాదబాయిలు, ఇసుర్రాయిలు, అలనాటి అమరుల త్యాగాల జాడలు, అమ్మ మనస్సున్న అప్పటి మనుషులు పూర్తిగా కనిపించకుండా కనుమరుగైపోగా ఊరుకు వింతపోకడ అంటుకొని అప్పటి గొప్పతనం ఆకాశంలో కలిసిపోయిందని ఎంతగానో కుమిలిపోయారు. అలవోకగా గుర్తుకొచ్చే బాల్యం నాటి ఊరు జ్ఞాపకాలు మళ్లీ తనని పసివాడిని చేస్తున్నాయన్నారు. అక్షరం అంటేనే అభ్యుదయం , పచ్చదనం అని అనుభవాల వాహినిగా, బతుకుకు వెలుగు రేఖగా అన్వయించి మానసవీణ అన్న కవితలో చెప్పారు. మానవ ప్రకృతిని ముడివేసి మానవీయ రాగ బంధాన్ని ఆవిష్కరించే అనుసంధాన సాధకమే అక్షరమని తెలిపారు. ఆధిపత్య యుద్ధకాంక్షాదాహాన్ని నిరసించారు. అన్యాయంపై గెలవాలన్న యుద్ధ సంకల్పం ఎంతో గొప్పదని భావించారు. బహుజన ఫిరంగిగా, దౌర్జన్యంపై మండిన భాస్వరంగా, ఆదిరుద్రమూర్తిగా, అభినవ చాణిక్యుడుగా, త్యాగాలకే తిలకంగా సర్దార్ సర్వాయిపాపన్నను ధీరోదాత్తునిగా చిత్రించారు. పాపన్న స్ఫూర్తితో పోరాడి తుది విజయాన్ని బహుజనులు పొందాలని పిలుపునిచ్చారు. చెమట చుక్కను మెరుస్తున్న ఆణిముత్యమన్న గొప్ప భావనను మారుకత్తి కవితలో ప్రకటించారు. ఎవరి మోచేతి నీళ్లు నీకెందుకు ? ఎవరి బాకా భజంత్రి నీకెందుకు ? అన్న వాక్యాలలో వెంకటయ్య కవితా దృక్పథం సుస్పష్టంగా వ్యక్తమైంది. నిన్ను నువ్వు తెలుసుకొని, కావలసినంతగా పదును పెట్టుకుని సరికొత్త శ్రేయో రాజ్యాన్ని ఆవిష్కరించమని అనడంలో మార్పును ఆశించే పరిణామశీలత దండిగా కలిగిన మేటి కవిగా ఆయన కన్పించారు. పల్లె పట్నానికి వలసపోతుంటే తెలంగాణ తల్లి గుండె ఎంతో తల్లడిల్లిపోయిందని అన్నారు. పల్లెల బతుకు చిత్రాలను చిధ్రమవకుండా గుండెగూటిలో పెట్టి పదిలంగా కాపాడమని వేడుకోవడంలో గ్రామ సీమలతో కవికి ఉన్న అమూర్తమైన అవ్యాజమైన అనుబంధం వ్యక్తమైంది. స్వాంతన మూర్తిగా, మహాద్భుత శక్తిగా ఆకాశంలో సగం కవితలో స్త్రీ మూర్తిని చిత్రిస్తూ మహిళాభ్యుదయమే దేశ సౌభాగ్యమని వెల్లడించారు. కన్నెర్రజేసిన ఎర్రజొన్న కవిత మట్టిని ముద్దాడిన చెమట చుక్కల పొలికేకల ఆర్తనాదాల్ని అద్భుతంగా వ్యక్తీకరించి ఎర్రగుండెల్లో మండిన నిప్పుకణికల హోరును ప్రత్యక్షంగా చూపింది. మతం గితం వద్దని మానవత్వమే మనిషికి అతిపెద్ద అభిమతమని కవిగా వెంకయ్య హితవు పలికారు. నా హృది పారే ఒక నది అని పాల్కురిని, బమ్మెరపోతన, శ్రీనాథుడు, శ్రీశ్రీ, విశ్వనాథ, జాషువా, కాళోజి, దాశరథి, సినారె, శేషేంద్ర, ఆరుద్ర, సోమసుందర్, తిలక్ వంటి నాటి కవులను, నేటి వర్తమాన కవితాప్రపంచపు నిప్పురవ్వలను ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. ఎడారి తోడేళ్లను చూసి గుండెలవిసేలా చెట్లు ఏకధాటిగా కన్నీళ్లు పెట్టాయన్నారు. అమెరికాలోని శ్వేతసౌధం జాత్యహంకారాన్ని విడిచి సమతాసదనంగా మారాలని…