కులగణ ( Caste census) ను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నిజంగా ఎంతో ధైర్యంగా తీసుకున్నది. గతంలో ఏ ప్రభుత్వం ఈవిధంగా నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇందుకు కారణం వాటి నిర్లక్ష్యమే. నిజం చెప్పాలంటే మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సామాజిక న్యాయం జరుగుతుంది. ఎవరెన్ని శుష్క వాగ్దానాలు చేసినా సామాజిక న్యాయం కోసం ఇంతటి నిబద్ధంగా ఏ కేంద్ర ప్రభుత్వం పనిచేయలేనది ఘంటాపథంగా చెప్పొచ్చు. అంబేడ్కర్ కలలను నిజం చేసే విధంగా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కోవడం ముదావహం. ఈ నిర్ణయం ఏ ఒక్కరికో కాదు, దేశంలోని వెనుకబడిన వర్గాలన్నింటికీ న్యాయం చేకూర్చడానికి తీసుకున్నది. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి ఇదెంతగానో ఉపయోగకరం.
2025 ఏప్రిల్ 30న కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ప్రకారం, రాబోయే జనాభా గణనలో కులగణనను అధికారికంగా చేర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది 1931 తర్వాత దేశ స్థాయిలో తీసుకున్న మొట్టమొదటి గంభీర నిర్ణయం. ఇది కేవలం పరిపాలనా ప్రకటన కాదు రాజ్యాంగబద్ధత కలిగిన, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చర్య.
మొదటి నుంచీ నిర్లక్ష్యం
నెహ్రూ ప్రభుత్వం అధికరణ 340 ప్రకారం తొలిసారి కాకాసాహెబ్ కలేల్కర్ కమిషన్‌ను నియమించి 1955లో నివేదిక అందించినా, దానిని పట్టించుకోకుండా పక్కన వేసింది. తదుపరి పాలకులు కూడా ఈ దిశగా ముందడుగు వేయలేదు. డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ 1951లో మంత్రి పదవికి రాజీనామా చేస్తూ అధికరణ-340 గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణనకు చట్టబద్ధతను కల్పించేది ప్రధానంగా అధికరణ 340. అటువంటప్పుడు రాష్ట్రపతి నియమించే కమిషన్ సిఫారసుల ఆధారంగా కులగణన అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక ప్రభుత్వానికి వున్నప్పుడు ఇది నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదన్న ఆవేదన ఆయన వ్యాఖ్యల్లో వ్యక్తమైంది. అంటే కులగణన అనేది రాజ్యాంగ బద్ధమనేది స్పష్టమవుతోంది. తర్వాతి కాలంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్ ఏర్పాటు చేసినా ఇందిరాగాంధీ దాన్ని పట్టించుకోలేదు. రాష్ట్రపతికి సమర్పించిన కమిషన్ నివేదికను నిర్లక్ష్యం చేయడం చారిత్రక తప్పిదంగా మిగిలిపోయింది. 1990లో వీపి సింగ్ మండల్ నివేదికను అమలు చేసి 27% ఓబీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేశారు. ఇది సామాజిక న్యాయ చరిత్రలో నిలిచిపోయిన ఘట్టంగా చెప్పుకోవాలి. ఇవన్నీ కులగణనకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలుగానే చూడాలి. చివరకు 1992లో ఇంద్రసాహ్నీ తీర్పు ద్వారా కులగణన రాజ్యాంగబద్ధం కావడం గమనార్హం.
సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈ సీసీ)–2011
2011లో చేపట్టిన సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) లోపభూయిష్టంగా వుంది. 46 లక్షల లోపాలు, పని చేయని డేటా, పనగారియా కమిటీ రద్దు, కేంద్ర అఫిడవిట్… వీటన్నింటినీ పరిశీలిస్తే చట్టబద్ధత లేకుండా గణన చేస్తే, ప్రజాధనాన్ని వృథా చేసే ప్రమాదమే అధికమన్నది సుస్పష్టమవుతోంది.
సమగ్ర గణన లేకుండా సమర్థ పాలన సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలోని అన్ని అధికారాల అమలుకు కులగణన అత్యంత అవసరం. రిజర్వేషన్లకు, అభివృద్ధి ప్రణాళికలకు బలమైన ఆధారాలు కావాలంటే కులగణన తప్పనిసరి.
గణాంక ప్రకియ కాదు
కులగణన అనేది కేవలం గణాంక ప్రక్రియ కాదు. ఇది వెనుకబడిన వర్గాల హక్కులకు చట్టబద్ధ రూపం ఇచ్చే చర్య. ఇది ఓబీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితిగతులపై అవగాహన పెంచే చారిత్రక సాధనం. వెనుకబడిన వర్గాల రాజ్యాంగ బద్ధమైన సామాజిక న్యాయ లక్ష్యాలను సాధించేందుకు కీలక సాధనం. కులగణన ఆధారంగా అర్హత గల వర్గాలకు రిజర్వేషన్, అభివృద్ధి ప్రణాళికలు అమలవుతాయి
వెనుకబడిన వర్గాల వాస్తవ స్థితిని గుర్తించేందుకు ప్రభుత్వం వద్ద శాస్త్రీయ ఆధారాలుంటాయి. ప్రత్యక్ష సమాచారం ఆధారంగా పాలన రూపుదిద్దుకుంటుంది.
సంక్షిప్తంగా – ముఖ్యమైన న్యాయ విచారణలు
1. ఇంద్రస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992)
2. అశోక్‌కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2008)
3. జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2017)
4. ఆధార్ కేసు (2018)
5. ఐఆర్ కోయిల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (2007)
సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్
2021 సెప్టెంబర్ 21న కేంద్ర సామాజిక న్యాయ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. “సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ ఈసీసీ)–2011 గణనలో నమోదు చేసిన కులపేర్లు అస్పష్టంగా ఉన్నాయి. గణన పూర్తిగా నమ్మదగినది కాదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు అనువైన సమాచారం ఈ గణనలో లేదు.” అని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. మొత్తంమీద చెప్పాలంటే 2011 కులగణనలో రూ.4,893 కోట్లు ప్రజాధనం వృథా అయింది. ఈ కులగణన ఆర్జీఐ ఆధ్వర్యంలో కాకుండా, గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు నిర్వహించడం ఇందుకు ప్రధాన కారణం. అదీకాకుండా గణనలో గణాంక ప్రమాణాలు పాటించలేదు. గోత్రాలు, ఇంటిపేర్లు కలగలిసిపోయి 46 లక్షల లోపాలతో తయారైంది. ఇందులో పేర్కొన్న డేటాను ఎక్కడా వాడుకోవడానికి అనువుగా లేదు.
ఇప్పుడు చేపట్టాల్సిన చర్యలు
జనాభా గణన చట్టం, 1948లో “కులం” అనే పదాన్ని చేర్చాలి. గోప్యత రక్షణకు కొత్త సెక్షన్ (ఉదా: 8ఎ) చేర్చాలి. డేటా వినియోగ నియంత్రణలు చట్టంలో పొందుపరచాలి. ప్రతి జనాభా గణనలో కులగణన భాగం కావాలి. ఓబీసీ మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఏర్పాటు చేయాలి. ఉపకులాలు, వృత్తులు, గోత్రాల ఆధారంగా శాస్త్రీయ నమూనా రూపొందించాలి. ఇవి కనక చేపడితే కులగణనకు ఒక సంపూర్ణత ఏర్పడుతుంది.
ముగింపు
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న జనాభా గణనలో కులగణన నిర్ణయం మహోన్నతమైనది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న తొలి కేంద్ర ప్రభుత్వంగా చరిత్ర పుటలలో ఈ ప్రభుత్వం నిలిచిపోతుంది. అయితే చేపట్టబోయే ఈ కులగణనను జనాభా గణన చట్టం – 1948లో తగిన సవరణలతో అమలు చేస్తే, ఇది ఒక శాశ్వత పరిష్కారంగా మారుతుంది. దేశంలో ప్రతి పదేళ్లకు కులగణనను నిరంతరం నిర్వహించే విధానం అమలవడమే దేశ ప్రజల మధ్య ఉన్న అంతరాలను తగ్గించి, సమగ్ర అభివృద్ధికి దోహదపడే మార్గం అవుతుంది. డా. బీఆర్. అంబేడ్కర్ చెప్పినట్టు “సామాజిక గణాంకాలు అన్యాయాన్ని చూపించే అద్దంలా ఉండాలి.” ఈ అద్దాన్ని నిజం చేయాలంటే కులగణనను చట్టసవరణలతో, శాస్త్రీయ ఆధారాలతో, పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయం ఇదే.
చట్టబద్ధతకల్పించే రాజ్యాంగ అధికరణలు
1.అధికరణలు 15(4), 16(4): వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రానికి అధికారం.
2. అధికరణ 31బి & 9వ షెడ్యూలు: తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్నా చట్టబద్ధంగా కొనసాగుతాయి.
3. అధికరణ 31సి: అధికరణ 39(బి), 39(సి) అమలుకు సంబంధించి చేసే చట్టాలు 14, 19వ అధికరణాలకు వ్యతిరేకంగా ఉన్నా చట్టబద్ధంగా కొనసాగుతాయి.
4. అధికరణ 39(బి), 39(సి): వనరుల సమాన పంపిణీ, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండేలా చూడటం.
5. అధికరణ 46: రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్య మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన బాధ్యతను కలిగి ఉంటుంది.
6. అధికరణ243-డి(6), 243-టి(6): స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలకు అధికారం కల్పించే అధికరణలు.
డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
మాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్
9849912948





