– అజారుద్దీన్ కోసం ప్రత్యేకం
– రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఏర్పాట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: రేపుమంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు కొత్త మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కేబినెట్ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్‌భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 22 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత మరో ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇక మిగిలిన మూడు మంత్రి పదువులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈ మూడు మంత్రి పదవుల్లో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావించింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గంలో మరో రెండు ఖాలీలకు అధిష్టానం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి మరి. కాగా.. మైనారిటీని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉందని.. అందులో భాగంగానే అజారుద్దీన్ కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనకు హా ఇచ్చి పక్కన పెట్టారని రాజగోపాల్ రెడ్డి పదేపదే విమర్శలు చేస్తున్నా ఆయనకు మాత్రం అవకాశం దక్కకపోవడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




