ఈ కార్‌ రేసింగ్‌పై చర్చకు బిఆర్‌ఎస్‌ పట్టు

భూ భారతిపై చర్చను అడ్డుకునే యత్నం
 నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌

రాష్ట్ర శాసనసభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడిరది. దీంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడం.. దీనిలో ఏ-1గా బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేరును చేర్చడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేసు అంశంపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తర్వాత నిర్ణయం తీసుకుందామని బిఆర్‌ఎస్‌ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. ఫార్ములా ఈ-రేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించినదని.. భూ భారతి బిల్లు రాష్ట్ర ప్రజలకు చెందినదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బిఆర్‌ఎస్‌  సభ్యులు యత్నించగా వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో పలువురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు.

అదే సమయంలో కొందరు కాంగ్రెస్‌ సభ్యులు పేపర్లు చించి బిఆర్‌ఎస్‌ సభ్యుల వైపు విసరడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడిరది. అంతకుముందు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారు. కేటీఆర్‌ను అప్రతిష్ఠ పాల్జేసి భారాసను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ అంశంపై రకరకాల లీకులు ఇస్తున్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా ఈ-రేసుపై నిర్ణయం తీసుకున్నాం. మేం తప్పు చేశామంటున్నారు.. దీనిపై సభలో చర్చించి ఆ తప్పేంటో చెప్పాలి. పెట్టింది అక్రమ కేసు కాకుంటే వెంటనే సభలో చర్చించాలి. మేం తప్పు చేయలేదని కేటీఆర్‌ చెప్పారు. ఈ విషయంలో స్పష్టమైన హా ఇస్తే సహకరిస్తాం‘అని హరీశ్‌రావు అన్నారు.

అయితే స్పీకర్‌ వారిని వారించినా వినలేదు. భూభారతిపై చర్చకు పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి అవకాశం ఇచ్చినా మాట్లాడలేదు. అనంతరం నినాదాలు చేస్తూ శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. ఫార్ములా ఈ రేసుపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీలో పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం దానికి అనుమతించకపోవడంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రపంచస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్‌ నగరానికి ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను కేటీఆర్‌ తీసుకొస్తే.. ఆయనపై అక్రమ కేసులు పెట్టడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ అంశంపై చర్చకు పెడితేనే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ కారు రేసింగ్‌పై చర్చకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page