బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి

స్థానిక సంస్థల ఎన్నికల వర్క్‌ షాప్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకొస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పార్టీ వర్క్‌ షాప్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ చాలా భయంకరమైంది.. బీజేపీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, నాయకులు, సోషల్‌ మీడియా టీమ్‌ ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారు.. జడ్జిలు, వ్యాపారస్తులు, సినీ నటులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్‌ చేశారు.. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ నాటకాలాడుతున్నాయి.. ఈ రెండు పార్టీలూ బీజేపీని అడ్డుకునేలా కుట్రలు చేస్తున్నాయి అని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రానికి అప్పుపుట్టడం లేదంటూ మాట్లాడుతున్నడు.. ఇది గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత ప్రభుత్వ పాపమే. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల చేతగానితనం, అసమర్థత కారణంగానే తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది.. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించలేని పరిస్థితి దాపురించింది. అని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందంటూ రైల్వేలు, విద్యారంగం, జాతీయ రహదారులు, ఆరోగ్య రంగం, గ్రామాల అభివృద్ధి.. ఇలా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే తెలంగాణలో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదని కిషన్‌రెడ్డి వివరించారు. ఈరోజు రాష్ట్రంలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ ఒకేసారి ఈ స్థాయిలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి

మండల కమిటీలు, జిల్లా కమిటీల నుంచి వచ్చిన నూతన నాయకత్వం రానున్న రోజుల్లో ఉద్యమాలతో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే తెలంగాణను రక్షించుకోగల్గుతాం.. ఇప్పటికే మనం విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటున్నాం..
మండల కమిటీల్లో వచ్చిన కొత్త రక్తానికి, నూతన నాయకత్వానికి పార్టీ సిద్ధాంతాలపై అవగాహన కల్పించాల్సి ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో ఏ తెలంగాణ ఉద్యమకారుని కలిసినా, విద్యావంతుడిని కలిసినా, కళాకారుడిని కలిసినా, అధికారులను కలిసినా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని రక్షించాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలంటున్నారు.. మోదీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి సరైన దిశలో పరిష్కారాలు లభిస్తాయి.. లేకుంటే తెలంగాణను రక్షించడం సాధ్యం కాదు అని చెబుతున్నార’ని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శిక్షణా తరగతులు నిర్వహించాలి.. మోర్చాల ద్వారా మండలాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని సూచించారు.  నూతన అధ్యక్షులు, యువత, ప్రజల నుంచి వచ్చిన నాయకులు చాలామంది కొత్తవారు పార్టీకి శక్తివంతంగా నిలుస్తున్నాంని తెలిపారు. జిల్లాల్లో అనేకమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అన్ని జిల్లాల్లో చేరికల కోసం కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్ర నేతలు స్వయంగా చొరవ చూపి వారిని పార్టీలో చేర్చే దిశగా ముందుకెళ్తున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాచరణను మరింత బలపరిచేలా వర్క్‌ షాప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఈనెల 25న ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదంటూ వారు అధికారంలో ఉన్న ప్రతిసారీ రాజ్యాంగ వ్యతిరేకంగా, నియంతృత్వ ధోరణిలో వ్యవహరించడం చరిత్రగా ఉందన్నారు. అలాంటి పార్టీకి ఈరోజు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *